NTR centenary celebrations : నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకల అంకురార్పణ సభ విజయవాడలోని పోరంకిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూపర్‌స్టార్ హీరో రజనీకాంత్, తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్బంగా ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలపై రెండు పుస్తకాలు విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాలు, ప్రజలను చైతన్యపరుస్తూ చేసిన ప్రసంగాలు ఉన్నాయి.
మా పూర్వ జన్మ సుకృతం.. సభకు వచ్చిన రజనీకాంత్‌కు ఎన్టీఆర్ కుటుంబసభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్ లాంటి ఓ మహనీయుడు సంతానంగా పుట్టడం తమ పూర్వ జన్మ సుకృతమని ఎన్టీఆర్ కుమార్తె గారపాటి లోకేశ్వరి, తనయుడు నందమూరి బాలకృష్ణ తెలిపారు. 100 ఏళ్ల క్రితం వెలిగిన ఓ వెలుగు తెలుగు జాతికి వెయ్యేళ్ల వైభవం తీసుకొచ్చిందని బాలకృష్ణ చెప్పారు. ఎన్టీఆర్ నడయాడిన నేలపై ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన తన గురువు, దైవం, తండ్రికి శతజయంతి వందనాలు అని బాలకృష్ణ చెప్పారు. ప్రతీ ఒక్కరూ తెలుగువాడిని అని గర్వంగా చెప్పుకునే గుర్తింపు తెచ్చిన నిజమైన హీరో ఎన్టీఆర్ అని కొనియాడారు. రాజకీయాల ద్వారా సంక్షేమానికి శ్రీకారం చుట్టి సరికొత్త చరిత్ర సృష్టించారని తెలిపారు.
నటనకు జీవం పోసి... నటనకు జీవం పోసిన నటధీరశాలి ఎన్టీఆర్ అని బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ అసమాన నటుడు అని.. ఎన్నో పౌరాణిక పాత్రలకు ప్రాణం పోశారన్నారు. ఎన్టీఆర్ పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసేవారని తెలిపారు. ఎన్టీఆర్ సినీరంగంలోనే కాకుండా రాజకీయాల్లో రాణించారన్నారు. ఎన్టీఆర్ ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని తీసుకు రావడంతో పాటు మరెన్నో సాహసోపేత పథకాలను ప్రవేశపెట్టారని బాలకృష్ణ చెప్పారు. రూ.2కు కిలో బియ్యం పథకం తెచ్చి పేదల ఆకలి తీర్చిన మహానుభావుడు ఎన్టీఆర్ స్పష్టం చేశారు. పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేయడమే కాకుండా.. ప్రజల వద్దకు ప్రభుత్వ పాలన తీసుకువచ్చిన మహానేత ఎన్టీఆర్ అని తెలిపారు.
ఎన్టీఆర్ జీవితమే ఒక చరిత్ర... ఎన్టీఆర్ గురించి నాలుగు పంక్తుల్లో చెప్పడం సాధ్యం కాదని ఆయన కుమార్తె లోకేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ జీవితమే ఒక మహా చరిత్ర అని.. ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందన్నారు. ఎన్టీఆర్ గురించి ప్రజలకే ఎక్కువగా తెలుసన్నారు. సినీరంగంలోనే కాకుండా రాజకీయంలో ఆయనకు ఆయనే సాటి అని తెలిపారు. ప్రజల కోసం ఎన్టీఆర్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఎన్టీఆర్ సంతానంగా పుట్టడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, ప్రజలందరి ఆదరాభిమానాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నట్లు లోకేశ్వరి తెలిపారు.
ఇవీ చదవండి :