Husband-Killed-His-Wife With Axe: ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలం గోపాలపురం గ్రామంలో పండగ పూట విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య మూడు కల్యాణిని (40) భర్త కోటేశ్వరరావు గొడ్డలితో కిరాతకంగా నరికి చంపాడు. భార్యను హత్య చేసిన అనంతరం ఘటనా స్థలం నుంచి పారిపోయిన నిందితుడు.. సమీపంలోని మామిడితోటలోని ఓ చెట్టెక్కి కూర్చున్నాడు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారిలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..
పోలీసులకు అందిన సమాచారం ప్రకారం ఇదీ జరిగింది.. నిందితుడు కోటేశ్వరరావు వారం రోజులుగా మద్యం తాగి రోజూ భార్యతో గొడవపడుతున్నాడు. ఇదే క్రమంలో బుధవారం రాత్రి కూడా మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యను అన్నం పెట్టమన్నాడు. అయితే భార్య అందుకు నిరాకరించినట్లు బంధువులు చెబుతున్నారు. దీంతో కోపోద్రిక్తుడైన నిందితుడు తన భార్యను హత్య చేసినట్లుగా అంతా భావిస్తున్నారు. భార్యను హత్య చేసిన అనంతరం నిందితుడు ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారిలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే గ్రామానికి సమీపంలో ఉన్న మామిడి తోటలో ఓ చెట్టెక్కి కూర్చున్న నిందితుడు కోటేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కొడవళ్లతో దాడి చేసి హత్య చేసిన గుర్తుతెలియని దుండగులు..
మరోవైపు.. కర్నూలు జిల్లా కౌతాళం మండలం హాల్వి గ్రామంలో దారుణ హత్య జరిగింది. ఉసేన్ భాషా(37) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు వెంబడించి.. కొడవళ్లతో నరికి చంపారు. బైపాస్ రహదారిలో.. నాలుగు రోడ్ల కూడలిలో కొన ఊపిరితో పడిఉన్న అతడిని స్థానికులు ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అతడు మార్గం మధ్యలోనే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు వైకాపా కార్యకర్త కావటం విశేషం. ఉదయం డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం బృందాలు.. ఘటనా స్థలాన్ని పరిశీలించాయి. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
నదిలో ఈతకు దిగి.. ఇద్దరు విద్యార్థులు మృతి..
ఇంకోవైపు.. పల్నాడు జిల్లా అమరావతి మండలం పరిధిలోని కృష్ణా నదిలో ఈతకు దిగి ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థులు మృతి చెందారు. పెదకూరపాడు మండలం 75-తాళ్లూరు గ్రామానికి చెందిన కీసర రాజశేఖర్ రెడ్డి(16), కొల్లి మల్లికార్జున్ రెడ్డి(16)లు.. అప్పటి వరకు గ్రామంలోని సీతారాముల కల్యాణంలో పాల్గొన్నారు. అనంతరం స్నేహితులతో కలిసి ఫోటో షూట్ అంటూ కృష్ణా నది వద్దకు వెళ్లారు. సరదాగా ఈత కొడదామని నదిలోకి దిగారు. ప్రమాదవశాత్తూ ఇద్దరు విద్యార్థులు నీటిలో మునిగిపోయి మరణించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.