Human trafficking Victims Demands: మానవ అక్రమ రవాణాపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు.. రాష్ట్రంలో పెద్ద దుమారాన్నే రేపాయి. అప్పటినుంచి ఈ సమస్యపై విస్తృత చర్చ జరుగుతోంది. అసలు రాష్ట్ర విభజన సమయం నుంచి 2021 వరకు అక్రమ రవాణాకు గురైన వారు పెద్ద సంఖ్యలో ఉండగా.. కేవలం 2వేల 5వందల మందికి మాత్రమే విముక్తి లభించింది. వారిలో కేవలం 15మందికి మాత్రమే నల్సా పథకం ద్వారా పరిహారం అందించారు. మిగిలిన వారంతా పునరావాస కేంద్రాల్లో మగ్గుతున్నారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం వేళ.. బాధితుల కోసం ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు ఏంటో చూద్దాం.
దేశంలో మానవ అక్రమ రవాణాకు సంబంధించిన కేసుల్లో ఎక్కువ శాతం మహిళలు, చిన్నారులే బాధితులుగా ఉన్నారు. ప్రధానంగా కొంత మంది వ్యక్తులు, కొన్ని సంస్థలు.. ఒంటరి, అనాధ, ఏ ఆధారం లేని మహిళలు టార్గెట్ చేస్తూ పని చేస్తున్నాయి. వారి బలహీనతలను గుర్తించి.. మాయ మాటలు చెప్పి, ఆశ చూపి అక్రమంగా.. ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఆపై వ్యభిచార కూపంలోకి నెడుతున్నారు. వ్యభిచార గృహాలపై దాడులు చేసే క్రమంలో పురుషులను, స్త్రీలను అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలిస్తారు. పురుషులు బెయిల్ పై త్వరగానే.. బయటకు వచ్చేస్తారు. మహిళా సెక్స్ వర్కర్లు మాత్రం షెల్టర్ హోమ్స్‌లో ఏళ్ల తరబడి ఉంటున్నారు. ఇలాంటి బాధిత మహిళలకు ప్రభుత్వం అండగా ఉండాలని.. వారి తరఫున పోరాడే మహిళలు కోరుతున్నారు.
అక్రమ రవాణా బాధితులకు పునరావాసం కల్పించేందుకు.. నిధులు కేటాయించడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని.. వారి రక్షణ కోసం పని చేస్తున్న సంస్థల ప్రతినిధులు విమర్శిస్తున్నారు. కమ్యూనిటీ ఆధారిత పునరావాసాన్ని కల్పించి ఆర్థిక, సామాజిక సాధికారతను అందించాలని.. అక్రమ రవాణా బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
"ప్రోత్బలానికి గురి చేసి.. మహిళలను వ్యభిచార కూపంలోకి బలవంతగా నెట్టిన దాఖలాలు చాలానే ఉన్నాయి. ఇలా చుట్టూ ఉన్న పరిస్థితుల దృష్ట్యా 90శాతం మంది మహిళలు.. ఈ కూపంలోకి వస్తున్నారుతప్ప.. కావాలని ఎవరూ ఇందులోకి రారు." - భాస్కర్, హెల్ప్ సంస్థ ప్రతినిధి
"వ్యభిచార గృహాలపై దాడులు చేసే క్రమంలో పురుషులను, స్త్రీలను అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలిస్తారు. పురుషులను మాత్రం పది.. పదిహేను రోజుల్లో వదిలేస్తున్నారు. మహిళా సెక్స్ వర్కర్లను మాత్రం షెల్టర్ హోమ్స్‌లోనే ఎందుకు ఉంచేస్తున్నారు. బెయిల్ పై బయటకు వచ్చిన పురుషులు బాగానే ఉంటున్నారు. కానీ మహిళలు మాత్రం వివక్షతకు గురవుతున్నారు. మహిళా సెక్స్ వర్కర్లపై మాత్రమే కాకుండా వారి పిల్లలపై కూడా ఈ ప్రభావం పడుతోంది." - బాధితురాలు