TENSION AT BUDDHA VENKANNA HOUSE : విజయవాడలో తెలుగుదేశం సీనియర్ నేత బుద్దా వెంకన్న నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. "ఖబడ్దార్ వంశీ" అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి నిరసనగా గన్నవరం వెళ్లేందుకు పార్టీ జెండాలతో సిద్ధమైన బుద్దాను పోలీసులు అడ్డుకున్నారు. బుద్దాను బయటికి రాకుండా గేటు మూసివేశారు. ఆయనతో పాటు కార్యకర్తలందరినీ గృహ నిర్బంధించారు.
"చంద్రబాబు, లోకేశ్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. విమర్శలు చేస్తే సమాధానం చెప్పాలిగానీ.. దాడులు చేస్తారా?. టీడీపీ కార్యాలయం ధ్వంసం చేసి ఎదురుదాడులు చేస్తారా?. ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వెళ్తుంటే నన్ను అడ్డుకున్నారు. వైసీపీలో ఎంత ఎక్కువ దాడులు చేస్తే వారికి టిక్కెట్లు ఇస్తారు. అందుకోసమే మాపై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు"
ఈ వ్యవహారంపై బుద్దా వెంకన్న సహా పలువురు తెలుగుదేశం కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు మమ్మల్ని ఎందుకు బయటకు వెళ్లనివ్వడం లేదని బుద్దా వెంకన్న నిలదీశారు. వంశీని పోలీసులు అడ్డుకుంటున్నారా.. పోలీసులు లేకపోతే వైసీపీ నేతలు రాష్ట్రాన్ని వీడి వెళ్లిపోయేవారని ఎద్దేవా చేశారు. తాము కర్రలను జెండాల కోసం వాడుతుంటే.. వైసీపీ కార్యకర్తలు మాత్రం విధ్వంసానికి వాడుతున్నారని దుయ్యబట్టారు.
వంశీ ఎలా కావాలంటే అలా మాట్లాడగలరని, ఇంటెలిజెన్స్ డీజీ గురించి గతంలో ఏం మాట్లాడారో అందరికీ తెలుసన్నారు. ఇప్పుడు ఆ కేసును ఎందుకు బయటకు తీయడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుతం జగన్ కోసం ఇన్ని మాటలు మాట్లాడుతున్న వంశీ.. ఆ తర్వాత ఈ మాటలన్నీ ముఖ్యమంత్రే మాట్లాడించారని చెప్పగలరని బుద్దా వెంకన్న విమర్శించారు. జగన్ మెప్పు కోసం చంద్రబాబు సహా ఆయన కుటుంబ సభ్యులపై అడ్డగోలుగా మాట్లాడటం, తెలుగుదేశం కార్యాలయంపై దాడులు చేయడం దారుణమని మండిపడ్డారు.
అసలేం జరిగిందంటే: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు, పార్టీ శ్రేణుల విధ్వంసంతో గన్నవరం రణరంగమైంది. ఎమ్మెల్యే మనుషులు పట్టణంలోని టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. రాళ్లు, కర్రలతో విరుచుకుపడి దొరికినవారిని దొరికినట్లు కొట్టారు. ఈ ఘర్షణలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలతోపాటు పోలీసులకూ గాయాలు అయ్యాయి. కార్యాలయ ప్రాంగణంలో ఉన్న పలు కార్లను ధ్వంసం చేశారు. ఏకంగా ఓ కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. అయితే పార్టీ ఆఫీసుపై దాడిని ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. వైసీపీ శ్రేణుల దౌర్జన్యకాండపై నిప్పులు చెరిగారు. తాజాగా గన్నవరం కార్యాలయానికి వెళ్లేందుకు సిద్ధమైన బుద్దా వెంకన్నను పోలీసులు అడ్డుకోవడంతో.. వెంకన్న నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఇవీ చదవండి: