Free Bus Travel for Woman in AP: టీడీపీ అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు గతేడాది మేలో జరిగిన మహానాడులో ప్రకటించారు. అలాగే గత నెల 20న విజయనగరం జిల్లాలో పోలిపల్లి వద్ద జరిగిన యువగళం-నవశకం సభలోనూ ఆ హామీ అమలు చేస్తామంటూ మరోసారి స్పష్టం చేశారు. అప్పటి నుంచి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అప్రమత్తమై ముందుగా తామే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసేందుకు ఆరాటపడుతోంది.
ఇందుకు అవసరమైన నివేదికలు తెప్పించుకుంటోంది. దీనికి సంబంధించి ఆర్టీసీ అధికారులను నివేదిక ఇవ్వాలని కోరడంతో అన్ని వివరాలు క్రోడీకరించి ఇటీవల వారు నివేదిక అందజేశారు. ఇప్పటికే ఆర్టీసీ రాబడిలో 25 శాతం తీసుకుంటున్నారు. కొత్తగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలనుకుంటే ఆ రాయితీ భారం అధికంగానే ఉంటుంది.
రాష్ట్రంలో నానాటికీ దిగజారుతున్న ఆర్టీసీ పరిస్థితి - సగానికిపైగా డొక్కు బస్సులే
అటు రాబడిలో వాటా ఇచ్చి, ఇటు ఉచిత ప్రయాణ రాయితీ భరించాలంటే సంస్థకు తీవ్ర నష్టం. కనీసం డీజిల్ కొనుగోలుకు అవసరమైన సొమ్ము సంస్థ వద్ద ఉండదని ఆర్టీసీ(RTC) యాజమాన్యం ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో వెల్లడించినట్లు తెలిసింది. ఆర్టీసీలో నిత్యం సగటున 40 లక్షల మంది వరకు ప్రయాణిస్తున్నారు. ఇందులో 15 లక్షలకు పైగా మహిళలు ఉంటారని అంచనా. ఆర్టీసీకి టికెట్ల విక్రయాల రూపంలో రోజుకు సగటున 16 నుంచి 17 కోట్ల రూపాయల చొప్పున నెలకు 500 కోట్ల రూపాయల వరకు వస్తోంది.
ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణం అమలుచేస్తే నెలకు 150 నుంచి 180 కోట్ల రూపాయల వరకు రాబడి కోల్పోతామని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు తాము జీతాలు ఇస్తున్నందున సంస్థ రాబడిలో 25శాతం ఇవ్వాలని చెబుతూ ప్రతినెలా సగటున 125 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం తీసుకుంటోంది. ఇప్పుడు మహిళలకు రాయితీ భరించడంతో పాటు, ప్రభుత్వానికి సొమ్ము చెల్లింపు కూడా కొనసాగిస్తే ప్రతినెలా దాదాపు 300 కోట్ల రూపాయల వరకు ఆర్టీసీ కోల్పోతుంది.
పేరుకే ప్రభుత్వంలో విలీనం - ఉద్యోగుల ప్రయోజనాలను హరించిన వైసీపీ ప్రభుత్వం
అంత మొత్తం లేకపోతే డీజిల్, విడి పరికరాల కొనుగోళ్లు, బస్సులు, బస్టాండ్ల నిర్వహణ కూడా సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. బ్యాంకు రుణాలు, ఉద్యోగులకు చెల్లించాల్సిన బాకాయిలు, కొత్తగా కొనుగోలు చేస్తున్న బస్సులకు రుణ వాయిదాలూ చెల్లించే పరిస్థితి ఉండదంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి చూస్తే మహిళల ఉచిత ప్రయాణ రాయితీని నెల నెలా ఆర్టీసీకి చెల్లించే అవకాశం లేదని తెలుస్తోంది. అయినా మహిళల ఉచిత ప్రయాణాన్ని సంక్రాంతికి లేదా ఈ నెలాఖరు లోపు అమల్లోకి వచ్చే వీలుందని సీఎం వద్ద దీనిపై సమావేశం జరిగిన తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి.