Expulsion Of The City In Vijayawada : ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలోని పలువురు నేర చరిత్ర ఉన్న వ్యక్తులపై పోలీసులు నగర బహిష్కరణ విధించారు. నగరంలో శాంతి భద్రతలకు, సామాన్య ప్రజా జీవనానికి విఘాతం కలిగిస్తూ, గంజాయి, ఇతర మత్తు పదార్ధాలను సేవించడం, వాటి అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురు నిందితులపై చర్యలు తీసుకుంటూ నగర సీపీ కాంతి రాణా టాటా ఆదేశాలు జారీ చేశారు.
22 మంది బహిష్కరణ : అజిత్సింగ్ నగర్ పోలీస్ స్టేషన్కు పరిధిలో ఉన్న ఉప్పుగల్ల సాయిమహేష్ అలియాస్ నాని (24), కృష్ణ లంక పోలీస్ స్టేషన్కు పరిధిలో ఉన్న లంకలపల్లి సాయి కిరణ్ అలియాస్ దొంగ సాయి(21), టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిదిలోని ధనలకోట గిరీష్ (29), నున్న పోలీస్ స్టేషన్కు పరిధిలో ఉన్న మొహమ్మద్ కరీం (32), పడ్డా దుర్గారావు అలియాస్ కర్తెబియా(26) లను నగరం నుంచి బహిష్కరించారు.
ఈ ఐదుగురు వ్యక్తులు గంజాయి రవాణా, వివిధ నేరాలకు సంబంధించి అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళి బయటకు వచ్చిన అనంతరం కూడా నేర ప్రవృత్తిని మార్చుకోకపోవడం, శాంతి భద్రతల పరిరక్షణకు విఘాతం కలుగజేస్తుండడంతో వారిని పోలీస్ కమీషనరేట్ పరిధి నుండి బహిష్కరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు 22 మందికి నగర బహిష్కరణ విధించారు.
త్వరలో మరో ముగ్గురిపై అమలు.. కఠిన చర్యలు : మరో ముగ్గురిపై నగర బహిష్కరణ విషయమై నోటీసులు జారీ చేశారు. వీటిని త్వరలో అమలు చేస్తామని పోలీస్ కమిషనర్ తెలిపారు. నగరంలో చెడునడత కలిగిన వ్యక్తులపై నిఘా ఏర్పాటు చేశామని...., వారు ఏదైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే వారిపై కేసు నమోదు చేసి, చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.
కర్ణాటక ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఐచర్ వాహనం : జాతీయ రహదారిపై కర్ణాటక ఆర్టీసీ బస్సును ఐచర్ వాహనం ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా పదిమందికి స్వల్ప గాయాలైన ఘటన శ్రీ సత్య సాయి జిల్లాలో చోటుచేసుకుంది. చిలమత్తూరు మండలం కోడికొండ చెక్ పోస్ట్ వద్ద బెంగళూరు వైపు వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సును ఐచర్ వాహనం ఢీకొనడంతో ఐచర్ వాహనం డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న పదిమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన ప్రయాణికులను కర్ణాటకలోని బాగేపల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాద సమయంలో కేఎస్ఆర్టీసీ బస్సులో 22 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. చిలమత్తూరు మండలం పోలీసులు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి