Expert Committee on Cliff Falling at Indrakeeladri: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొండచరియలు జారి పడిపోకుండా తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై నిపుణుల కమిటీ పరిశీలన చేసింది. పరిస్థితులను క్షుణ్నంగా అధ్యయనం చేసిన కమిటీ.. మూడు, నాలుగు రోజుల్లో నివేదికను దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు అందజేయాలని భావిస్తోంది. ఈలోపు దసరా ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చేపట్టాల్సిన పనులపై కూడా ఓ నిర్ణయం తీసుకోవాలని.. పాలకమండలి, అధికారులు యోచిస్తున్నారు. నిపుణుల కమిటీ నివేదికలో పొందుపరిచిన అంశాల ఆధారంగా నిధుల వ్యయంపై ఓ అంచనాకి రానున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ మరోసారి విజయవాడ ఇంద్రకీలాద్రిపై సమగ్ర పరిశీలన చేపట్టింది. విశ్రాంత ఇంజనీర్ ఇన్ చీఫ్, దేవాదాయశాఖ ఇంజనీరింగ్ పనుల సలహాదారు ఆర్. కొండలరావు నేతృత్వంలో భూ భౌతికశాస్త్రం, ఇతర ఇంజనీరింగ్ నిపుణులు ఇటీవల కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని క్షుణ్నంగా పరిశీలించారు. కొండపై నుంచి పెద్దపెద్ద రాళ్లు విరిగిపడిన తర్వాత చేపట్టిన ఇంజినీరింగ్ పనుల గురించి దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఈఈలు కోటేశ్వరరావు, రమాదేవిలతో చర్చించారు.
Durga Temple Ghat Road Closed: జారిపడుతున్న కొండచరియలు.. ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు మూసివేత
ఈసారి దసరా ఉత్సవాలకు సమీపంలో ఊహించని రీతిలో బండరాళ్లు పడిపోవడంతో కొండను ఆనుకుని క్యూలైన్ల ఏర్పాట్లపై ఆందోళన నెలకొంది. కొండకు సమీపంలో నుంచి కాకుండా మోడల్ గెస్ట్‌హౌస్ వైపు నుంచి క్యూలైన్లు నిర్మాణం చేయాలని దేవస్థానం నిర్ణయించింది. భక్తుల్లో భయాందోళనలు తలెత్తకుండా ఉండేందుకు, భారీగా వర్షాలు కురిసినా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చేపట్టాల్సిన పనులపై.. దేవస్థానం అధికారులు నిపుణుల కమిటీని సూచనలు కోరారు. రెండు ప్రత్యామ్నాయాలపై కమిటీ సభ్యులు మధనం చేస్తున్నారు.
"దీనికి రెండు ప్రత్యమ్నాయాలు అనుకుంటున్నాము. గోడ నిర్మించి దీనికి లింక్ చేయాలని అనుకుంటున్నాము ఇదోక పద్దతి. రెండు పద్దతులను పరిశీలించిన తర్వాత.. వ్యయాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారు. నాలుగైదు రోజుల్లో నిర్ణయం తీసుకుని చెప్తాము." -ఆర్.కొండలరావు, విశ్రాంత ఈఎన్‌సీ
ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనానికి వెళ్లి... అనంత లోకాలకు చేరి..
"రీటైనింగ్ వాల్ ప్రోవైడ్ చేస్తున్నాము. రెండోది పైనున్న మట్టి పడిపోకుండా చర్యలు తీసుకుంటున్నాము. వర్షం నీరు ఇందులోకి చేరకుండా షాట్ క్రీట్ చేస్తున్నాము. వర్షం నీరు అందులోకి చేరకుండా కాలువ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము." -త్రిమూర్తిరాజు, భూగర్భ నిపుణుడు
నిపుణుల కమిటీ సభ్యులు మూడు, నాలుగు రోజులపాటు ఇంద్రకీలాద్రిని సమగ్రంగా పరిశీలించనున్నారు. గతంలో ఎలాంటి పనులు చేశారు.. వాటివల్ల కలిగిన ప్రయోజనాలు ఏమిటి.. ఇంకా మెరుగుపరిచాల్సిన పనులు ఏమిటి.. తదితర అనేక అంశాలను విశ్లేషించి నివేదిక అందజేయనున్నారు. నిపుణుల సూచనల మేరకు బడ్జెట్ అంచనాలు రూపొందించి అందుకు అనుగుణంగా ప్రాధాన్య క్రమంలో పనులు చేయాలని దేవస్థానం అధికారులు భావిస్తున్నారు.