Diet Charges Increased: రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, బీసీ సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, ఆశ్రమ తదితర పాఠశాలల్లోని విద్యార్థులకు డైట్ ఛార్జీలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త డైట్ చార్జీలు 2023-24 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్. జవహర్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. అన్ని రకాల పాఠశాలల హాస్టళ్లలో చదివే విద్యార్ధులకు నెలవారీగా ఇచ్చే డైట్ ఛార్జీలను 150 రూపాయల మేర పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు. మూడు నాలుగు తరగతుల విద్యార్ధులకు నెలవారీగా వెయ్యి రూపాయల నుంచి 1,150కి పెంచుతూ ఆదేశాలు ఇచ్చారు.
ఇక 5 వ తరగతి నుంచి 10 తరగతి వరకూ ఉన్న విద్యార్ధులకు ప్రస్తుతం నెలవారీ ఇచ్చే రూ 1,250 నుంచి 1400కు పెంపుదల చేశారు. ఇంటర్ సహా ఆపై ఉన్న హాస్టళ్లలోని విద్యార్ధులకు 1400 నుంచి 1600కు డైట్ ఛార్జీల పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు. 2023-24 విద్యా సంవత్సరంలో ఈ పెంపు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పెంపుదల 2023 జూన్ 1 తేదీ నుంచి అమల్లోకి రానున్నట్టు ప్రభుత్వం జీవోలో పేర్కొంది.
కాస్మోటిక్ ఛార్జీలు: బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లు వివిధ రెసిడెన్షియల్ పాఠశాలల్లో నెల వారీగా ఇచ్చే కాస్మోటిక్ ఛార్జీలను కూడా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 3 నుంచి 6 తరగతి బాలురకు ఇక నుంచి రూ 125 చొప్పున, బాలికలకు రూ.130 చొప్పున ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అలాగే 7 తరగతి నుంచి 10 తరగతి వరకూ చదివే బాలురకు రూ.150, బాలికలకు రూ 200కు వరకూ పెంచుతూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇంటర్ ఆపై చదివే విద్యార్ధులకు బాలురకు రూ 200, బాలికలకు రూ.250 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 2023-24 విద్యాసంవత్సరానికి ఈ పెంపుదల వర్తిస్తుందని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. 2023 జూన్ 1 తేదీ నుంచి ఈ పెంపుదల అమల్లోకి రానున్నట్టు ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది.
ఇవీ చదవండి