Devineni Uma Maheswara Rao : సైకో పాలన పోయి సైకిల్ పాలన రావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని విమర్శించారు. ప్రజా వ్యతిరేకత బయటపడకుండా, ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే చీకటీ జోవోను ప్రభుత్వం తీసుకువచ్చిందని.. దానిని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. జీవో గురించి హైకోర్టు చేసిన వ్యాఖ్యలను అందరూ చూశారని అన్నారు.
రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంటే.. ప్రభుత్వం ఏ ఒక్క రైతుకి భరోసా కల్పించటం లేదని ఆరోపించారు. మిర్చి పంటకు తెగుళ్లు సోకి పంటలు దెబ్బతింటుంటే.. ఒక్క శాస్త్రవేత్త పరిశీలనకు రాకపోవటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. సేకరించిన ధాన్యానికి ప్రభుత్వం రైతులకు బకాయిలు చెల్లించలేకపోతొందని విమర్శించారు. రైతులకు వ్యవసాయనికి యంత్రపరికరాలు అందివ్వలేదని.. ఎరువుల ధరలు అందుబాటులో లేవని ఆరోపించారు.
మున్సిపాలిటీలలో, కార్పోరేషన్లలో, పంచాయతీలలో అభివృద్ధి మాటే లేదని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులన్నీ భ్రష్టుపట్టిపోయాయని అన్నారు. జగ్గయ్యపేట నందిగామ ప్రాంతంలో కృష్ణా నదిపై వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలోని దుర్మార్గపు పాలనపైన గురిపెట్టామని ఆయన తెలిపారు.
రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం శ్మశానం చేసిందని.. ఇంకా ఏమి దోచుకోవటానికి వైనాట్ 175 అని విమర్శించారు. విదేశాల నుంచి తెప్పించిన నాణ్యతలేని మందు బ్రాండ్లను విక్రయించడం వల్ల.. తాగిన వారి ఆరోగ్యం చెడిపోతోందని ఆరోపించారు. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడిన దాని మూలాలు రాష్ట్రంలో ఉంటున్నాయన్నారు. చంద్రబాబు కుప్పం పర్యటనలో నానా ఆరాచకలు సృష్టించారని, చైతన్య రథాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారని గుర్తు చేశారు. ఈ నెల 27న లోకేశ్ కుప్పంలో పర్యటించనున్నారని.. మూడు రోజులపాటు నిర్వహించే ఈ పర్యటనకు తామంతా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. యువత ఎదుర్కోంటున్న సమస్యలకు పరిష్కారం దిశగా పర్యటన ఉంటుందని స్పష్టం చేశారు.
"ఈ నెల జనవరి 27న కుప్పంలో లోకేశ్ పర్యటించనున్నారు. షెడ్యూల్ కూడా వచ్చింది. చంద్రబాబు నాయుడుతో వస్తున్న మీకోసంలో వెంట నడిచాము. చంద్రబాబుతో పాల్గొన్న విధంగానే లోకేశ్‌తో యువగళం కార్యక్రమంలో పాల్గొంటాము. యువతు ఎదుర్కోంటున్న ప్రతి సమస్యకు పరిష్కారం దిశగా, ప్రతి సమస్యకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా పర్యటన ఉంటుంది" - దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ నేత
ఇవీ చదవండి: