NTR District: ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలంలో కిడ్నీ బాధితుల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. చికిత్స పొందుతూ ఒకే వారంలో ఇద్దరు మృత్యువాత పడగా.. గత 40 రోజుల వ్యవధిలో 8 మంది మృతిచెందారు. ఏ కొండూరు మండలం కేస్యా తండా గ్రామానికి చెందిన భారోతు సూకీని(56) కిడ్నీ వ్యాధితో మృతిచెందింది. 15రోజులు క్రితం సూకీనికి అస్వస్థతగా ఉండటంతో విజయవాడలోని ఓ ప్రైవేటు హాస్పటల్కి తీసుకెళ్లామని.. కిడ్నీ వ్యాధి లక్షణాలు ఉన్నాయని అక్కడ పరీక్షించిన వైద్యులు చెప్పారని మృతురాలి కుమారుడు బద్దు నాయక్ తెలిపారు.
క్రియాటిన్ 9.2గా ఉందని.. వెంటనే డయాలసిస్ చేయించాలని డాక్టర్లు సుచించారు. డయాలిసిస్ చేయించినప్పటికీ సూకీని తమకు దక్కకుండా పోయిందని బుద్ధ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యం నిమిత్తం రూ. 3లక్షల వరకు ఖర్చు చేసినా.. ప్రాణాలు నిలుపుకొలేకపోయామని కన్నీరుమున్నీరుగా విలపించారు. మరోవైపు వరస మరణాల నేపథ్యంలో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. అధికారులు స్పందించి మరణాలకు గల కారణాలపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: రోడ్లు లేక.. ప్రసవం కోసం 4 కిలోమీటర్లు డోలీలోనే..!