Registration Charges in Andhra Pradesh: రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు కొనుగోలుదారులకు షాకిస్తున్నాయి. అప్పోసప్పో చేసి, ఆస్తి కొన్నామనే ఆనందాన్ని ఆవిరి చేసేలా వైఎస్సార్సీపీ సర్కార్ రిజిస్ట్రేషన్ విలువలు, ఛార్జీలు పెంచింది. సాధారణంగా ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ బహిరంగ మార్కెట్ ధర కంటే తక్కువగా ఉంటుంది. కానీ, ఘనత వహించిన వైఎస్సార్సీపీ సర్కారు ఈ విషయంలోనూ రివర్స్‌లోనే వెళుతోంది. చాలాచోట్ల ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలను వాటి అసలు ధర కంటే భారీగా పెంచింది. ఫలితంగా ప్రభుత్వ ఖజానా నిండుతుంటే కొనుగోలుదారులు మాత్రం విలవిల్లాడుతున్నారు.
రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అసాధారణ రీతిలో ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలను పెంచి పేద, మధ్యతరగతి నడ్డి విరుస్తోంది. చాలా చోట్ల బహిరంగ మార్కెట్ కంటే సర్కారు ఖరారు చేసిన రిజిస్ట్రేషన్ విలువలు భారీగా ఉన్నాయి. దీనివల్ల తక్కువ ధరకు ఇళ్లు, స్థలాలు కొనుక్కున్నప్పటికీ స్టాంపు డ్యూటీ కింద అదనపు భారం భరించాల్సి వస్తోంది. ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం అధికారులు రిజిస్ట్రేషన్ విలువల పెంపులో, అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పరిధిలోని మాధవాయిపాలెంలో,ప్రభుత్వం మార్కెట్ విలువను గజం 23 వేల రూపాయలుగా నిర్ధారించింది. ఇక్కడ బహిరంగ మార్కెట్‌లో గజం భూమి ధర 15 వేలే. వాస్తవానికి గతంలో ఇక్కడి భూమి ప్రభుత్వ మార్కెట్ ధర గజం 10 వేలు. అప్పట్లో భూమి కొనుక్కున్నవారు కొందరు ఎక్కువ మొత్తంలో బ్యాంకు రుణాలు పొందేందుకు ఇతరప్రయోజనాల కోసం రిజిస్ట్రేషన్ల సమయంలో ఎక్కువ ఫీజు చెల్లించారు. దీన్ని గమనించకుండానే అధికారులు రిజిస్ట్రేషన్ విలువలను పెంచేశారు. మరికొన్నిచోట్ల గజం రిజిస్ట్రేషన్ విలువ కంటే 2 వేల తక్కువకే భూముల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. దీని ప్రకారం 100 గజాల భూమిని కొన్నవారిపై 20 వేల అదనపు భారం పడుతోంది.
విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నం పరిసరాల్లో గజం స్థలం రిజిస్ట్రేషన్ విలువ 8 వేల నుంచి 10వేల 700 వరకూ ఉంది. కానీ అక్కడ బహిరంగ మార్కెట్‌లో... స్థలాన్ని 7 వేల నుంచి 8 వేల మధ్యే అమ్ముతున్నారు. నంద్యాల జిల్లా అవుకులో గజం భూమికి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం మార్కెట్ విలువను 14 వందలుగా నిర్థరించింది. అంటే సెంటు భూమి 67 వేల 760 రూపాయలు! అవుకు శివార్లలో సెంటు భూమి 40 వేల నుంచి 50 వేలకే లభిస్తోంది. అక్కడ కొనుక్కున్నవారు కొందరు అసలు ధర కన్నా అధికంగా 17 వేల 760 స్టాంపు డ్యూటీ కింద చెల్లించాల్సి వస్తోంది.
New Problems with Online Registration in AP: కొత్త రిజిస్ట్రేషన్ విధానంతో.. కొత్త అనుమానాలు! సందేహాలను తీర్చాల్సిందేనంటున్న.. కొనుగోలు దారులు
మురికివాడల్లోనూ రిజిస్ట్రేషన్ల పేరిట బాదుడే బాదుడు కొనసాగుతోంది. విజయవాడ సెంట్రల్ దేవీనగర్‌రోడ్డు మొదట్లో గజం ధర 17 వేల వరకు ఉంటే దావు బుచ్చయ్యకాలనీ, గద్దె వెంకట్రామయ్యనగర్‌లలో గజం మార్కెట్ విలువ 33 వేలు పలుకుతోంది. ఇక్కడే ఉన్న మధురానగర్‌లో గజం ధర 28 వేల వరకు పెంచేశారు. మురికివాడల్లోనూ, స్టాంపు డ్యూటీ ఎక్కువగా ఖరారు చేశారు. జక్కంపూడి కాలనీ, అజిత్‌సింగ్‌నగర్, ఉడా కాలనీల్లో ప్రభుత్వ, మార్కెట్ ధరలకు భారీ వ్యత్యాసం ఉంది. విజయవాడ విలేజ్ పోర్షన్ మురికివాడల్లో ప్రభుత్వ, ప్రైవేటు మార్కెట్ విలువలు సమానంగా ఉన్నాయి. వన్‌టౌన్‌లోని సిండికేట్ బ్యాంకు కాలనీ వద్ద ప్రభుత్వ మార్కెట్ విలువ గజం 17 వేలు. అదే రోడ్డు చివర్లోని అంబేడ్కర్ కాలనీలో గజం 30 వేలు. డోర్ నంబరు ఆధారంగా విలువలను 80 శాతం పెంచేశారు.
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులో కొన్నిచోట్ల మాత్రమే బహిరంగ మార్కెట్ గజం ధర 7 నుంచి 8 వేలు పలుకుతోంది. అత్యధిక ప్రాంతాల్లో 4 నుంచి 5 వేలకు మించి లేదని స్థిరాస్తి వ్యాపారులు చెబుతున్నారు. నగర శివారు గోరంట్ల, అగతవరప్పాడు, వెనిగండ్ల తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ గజం 7 వేలుండగా ..స్థిరాస్తి వెంచర్లలో ప్లాట్లు గజం 5 వేల చొప్పున విక్రయిస్తున్నారు. నరసరావుపేట- గుంటూరు రోడ్డులోని జొన్నలగడ్డ రెవెన్యూ పరిధిలో కుప్పగంజివాగు సమీపంలో వాస్తవ ధర ఎకరా కోటి రూపాయలు. కానీ రిజిస్ట్రేషన్ ధర 4 కోట్ల 80 లక్షలు ఉండటం.. దోపిడీలో జగన్ సర్కారు చేతివాటానికి నిదర్శనం.
Sub Registration Offices: సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నరకం.. డబ్బులు తీసుకుంటారు.. కానీ వసతులు కల్పించరు..
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పురపాలక సంఘం బలిఘట్టం శివార్లలో వ్యవసాయ భూమి మార్కెట్ విలువ ఎకరాకు 38 లక్షలు, వ్యవసాయ భూమిలో మొక్కలుంటే 40 లక్షలుగా నిర్ణయించారు. బయ్యపురెడ్డిపాలెం ప్రాంతంలో రోడ్డుకు దూరంగా ఉన్న కొన్ని భూములు 30 లక్షల నుంచి 35 లక్షల లోపే లభిస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ విలువకు స్టాంపు డ్యూటీ చెల్లించాల్సి వస్తోంది.
మైలవరంలో 11 వేలు రిజిస్ట్రేషన్ విలువ కాగా 9 వేలకు క్రయ విక్రయాలు నడుస్తున్నాయి. 2వేల భారం కొనుగోలుదారులపై పడుతోంది. గన్నవరం సర్వే నెంబరు 270/1లో గజం రిజిస్ట్రేషన్ విలువ 7వేల 500 కానీ క్రయవిక్రయాలు 6వేలకే జరుగుతున్నాయి. కొనుగోలుదారులపై 15 వందల భారం పడుతోంది. పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు, సూరప్పగూడెంలో 3 వేలు భారం భరించాల్సి వస్తోంది. నంద్యాల జిల్లా మెట్టుపల్లి, మంగంపేట, పిక్కళ్లపల్లె తండా, ఇస్లానాయక్ తండాల్లో రిజిస్ట్రేషన్ విలువ 550 రూపాయలు కాగా 4 వందలకే క్రయవిక్రయాలు సాగుతున్నాయి. 150 రూపాయల మేర కొనుగోలుదారులపై సర్కారు భారం పడుతోంది. ఇలా ప్రభుత్వ ఖజానాలో ఓవైపు కాసులు గలగలలాడుతుంటే, కొనుగోలుదారుల జేబులు మాత్రం వెలవెలబోతున్నాయి.