CM Jagan Review on State Investment Promotion Board: స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డుపై (ఎస్‌ఐపీబీ) రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రులతో, ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. సమీక్షలో పలు కీలక విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం పలు పరిశ్రమల ప్రతిపాదనలకు, ప్రోత్సాహకాలకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది.
CM Jagan Key Instructions to Officials: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో జరిగిన రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమీక్షలో.. 19 వేల 37 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులకు అధికారులు ఆమోదం తెలిపారు. ఈ మేరకు వచ్చిన పలు ప్రతిపాదనలు, డీపీఆర్‌లకు ఆమోద ముద్ర వేశారు. సాంకేతికంగా విప్లవాత్మక మార్పులు వస్తున్న పరిశ్రమలకు వేగంగానే ఆనుమతులు మంజూరు చేయాల్సి ఉందని.. ముఖ్యమంత్రి జగన్ అధికారులకు సూచించారు. అందుకు అనుగుణంగానే పారిశ్రామిక విధానాన్ని మార్చుకోవాలని స్పష్టం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే ప్రథమ స్థానంలో ఏపీ ఉందని.. అనుమతుల విషయంలోనూ వేగంగా స్పందించాలని అధికారులకు సీఎం సూచించారు.
CM Jagan Comments: సమీక్షలో అధికారులతో సీఎం జగన్ మాట్లాడుతూ.. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల అమలు విషయంలో మరింత వేగం పెంచాలన్నారు. పరిశ్రమలకు అనుమతి ఇచ్చే విషయంలో అధికారులు చురుగ్గా వ్యవహరించాలని సూచించారు. ప్రపంచ పారిశ్రామిక రంగం పోకడలను అవగతం చేసుకోవాలని, ఆ మేరకు పారిశ్రామిక విధానాల్లో మార్పులు, చేర్పులు చేయాలన్నారు.
SIPB Approval of Various Industry Proposals: చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించిన పెప్పర్ మోషన్ కంపెనీ డీపీఆర్‌ను ఎస్ఐపీబీలో ఆమోదించింది. రూ.4,640 కోట్ల పెట్టుబడితో యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు స్పష్టం చేసింది. రూ.531 కోట్లు పెట్టుబడితో విజయనగరం జిల్లా ఎస్.కోటలో జేఎస్‌డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు ప్రతిపాదనలకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో శ్రేయాస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పరిశ్రమ ను రూ.1750 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే ప్రతిపాదనకూ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదం తెలిపింది.
Anakapalli District: అనంతరం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్‌లో స్మైల్ (సబ్‌స్ట్రేట్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇండియా లిమిటెడ్ ఎంటర్‌ప్రైజెస్)కంపెనీ ఆధ్వర్యంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ తయారీ యూనిట్‌కు ఎస్ఐపీబీ అంగీకారం తెలిపింది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద కోస్టల్ ఆంధ్రా పవర్ లిమిటెడ్ (రిలయెన్స్ పవర్) తన పారిశ్రామిక కార్యకలాపాన్ని మార్చుకునేందుకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. థర్మల్ పవర్ స్ధానంలో కొత్త తరహా, సాంప్రదాయేతర పర్యావరణహిత గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి ప్లాంటుకు కూడా ఆమోదాన్ని తెలియచేసింది.
East Godavari District: ఇక, తూర్పు గోదావరి జిల్లా విషయానికొస్తే.. కడియం వద్ద ఆంధ్రాపేపర్ లిమిటెడ్ విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనకు ఎస్ఐపీబీ అంగీకరించింది. విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్‌లో ఏటీసీ టైర్స్ లిమిటెడ్ విస్తరణ ప్రాజెక్టు డీపీఆర్ కూ ఆమోదాన్ని తెలియజేసింది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సమీపంలో ఎలక్ట్రోస్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ కంపెనీ విస్తరణకు ఆమోదాన్ని తెలియచేశారు. ఏలూరు జిల్లా కొమ్మూరు వద్ద శ్రీ వెంకటేశ్వర బయోటెక్ యూనిట్‌కూ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదం తెలిపింది. విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం మద్ది వద్ద ఓరిల్ పుడ్స్ లిమిటెడ్‌కు చెందిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కూ ఆమోదాన్ని తెలియచేసింది. రేపు జరుగనున్న కేబినెట్ సమావేశంలో ఎస్ఐపీబీలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదాన్ని తెలియచేయనున్నట్లు ఆ శాఖల అధికారులు తెలిపారు.