CM Jagan Review on Housing Construction Department: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఇళ్ల నిర్మాణాలు, మౌలిక సదుపాయాలు, ఆడిట్ విధానం, టిడ్కో ఇళ్ల నిర్మాణాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Officials Comments: గృహ నిర్మాణం కోసం మహిళలు పావలా వడ్డీకి ఇప్పటివరకూ తీసుకున్న రుణాలపై, వడ్డీ డబ్బు విడుదలకు సన్నద్ధం కావాలని.. అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. అనంతరం ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని అధికారులకు నిర్దేశించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. గత అక్టోబరులో 7 లక్షల 43వేల ఇళ్లను ఇప్పటికే అందించామని సీఎంకు తెలియజేశారు. ఫిబ్రవరి నాటికి మరో 5 లక్షల ఇళ్లు పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. కాలనీల్లో మౌలిక సదుపాయాలు సైతం కల్పిస్తున్నామని అధికారులు వెల్లడించారు.
CM Jagan Review on State Investment Promotion Board: రూ.19,037 కోట్ల పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ ఆమోదం
CM Jagan Comments: ముఖ్యమంత్రి జగన్ అధికారులతో మాట్లాడుతూ..''ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచండి. కాలనీల్లో మౌలిక సదుపాయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించండి. నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఇళ్లను ఆడిట్ చేయాలి. కరెంటు, తాగునీరు, సోక్ పిట్స్ పరిశీలించి.. ఆడిట్ చేయించండి. ఇంటి నిర్మాణానికి తీసుకున్న రుణాలపై వడ్డీ విడుదల చేయాలి. ఇప్పటిరకూ 12 లక్షల 72వేల 143 మంది మహిళలకు పావలా వడ్డీకే 35వేల రూపాయలు చొప్పున రుణాలు ఇచ్చాం. పావలా వడ్డీ రుణాలపై చెల్లించాల్సిన మిగిలిన వడ్డీ భారాన్ని.. ప్రభుత్వం భరించనుంది'' అని ఆయన అన్నారు.
CM Jagan on Tidco Houses: టిడ్కో ఇళ్ల నిర్మాణంపైనా కూడా ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. అధికారులు టిడ్కో ఇళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఎక్కడ ఏ సమస్యను గుర్తించినా.. వెంటనే దాన్ని సరిదిద్దేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. టిడ్కో కాలనీల్లో భవనాలు నిరంతరం నాణ్యతగా ఉండేలా, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.
''నిర్మాణాలు పూర్తి చేసుకున్న ప్రతి ఇంటిని ఆడిట్ చేయాలి. సదుపాయాలు ఉన్నాయా..?, లేవా..? అనే దానిపై ఆడిట్ నిర్వహించాలి. కరెంటు, తాగునీరు, సోక్ పిట్స్ ఉన్నాయా..? లేవా..? అనే వాటిపై ఆడిట్ చేయించాలి. టిడ్కో ఇళ్ల విషయంలో లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన అసోసియేషన్లు సమర్థవంతంగా పని చేసేలా వారికి తగిన అవగాహన కల్పించాలి. ప్రభుత్వం ఇచ్చిన లక్షల విలువైన ఆస్తిని ఎలా నిర్వహించుకోవాలన్న దానిపై కూడా అవగాహన ఇవ్వాలి. తద్వారా భవనాలు నిరంతరం నాణ్యతగా ఉండేలా, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోగలుగుతారు.'' -వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ సీఎం