Chandrababu Letter to President and PM: ప్రతిపక్షాలపై అక్రమ కేసులు, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు, అధికార దుర్వినియోగం వంటి అంశాలను వివరిస్తూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు... రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీలకు 9 పేజీల లేఖ రాశారు. రాష్ట్రంలో తీవ్రమైన, అసాధారణ పరిస్థితులు ఉన్నాయని చంద్రబాబు లేఖలలో ధ్వజమెత్తారు. మతిస్థిమితం లేని (unsound mind) వ్యక్తిగా సిఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రాన్ని అధోగతి పాలుచేశాయని తీవ్రంగా విమర్శించారు. తాజాగా చిత్తూరు జిల్లాలో తనపైనే హత్యాయత్నం చేసి తిరిగి తనపైనే హత్యాయత్నం కేసు పెట్టడాన్ని లేఖలో సవివరంగా తెలిపారు. 2019 ఆగస్టు నుంచి మొన్నటి అంగళ్లు ఘటన వరకు తనపై జరిగిన దాడులు, నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం అనుసరించిన విధానాలను లేఖలో వివరించారు. ప్రజావేదిక కూల్చివేత, రాజధాని విధ్వంసం, న్యాయ మూర్తులు, కోర్టులపై సోషల్ మీడియా ద్వారా దాడులు, ఎస్ఇసి, ఎపిపిఎస్సి చైర్మన్ లపై వేధింపులు, దేవాలయాలపై దాడులు, శాంతి భద్రతలు, గంజాయి అమ్మకాలు, దొంగ ఓట్ల రాజకీయాలు, మహిళలు, దళిత గిరిజన మైనారిటీ బలహీన వర్గాలపై దాడులు, అక్రమ కేసులు, మీడియాపై దాడులు వంటి పలు అంశాలను లేఖలో ప్రస్తావించారు.
Chandrababu Fires on YSRCP: 'ఎన్ఎస్జీ లేకపోతే.. వివేకాలాగే నన్నూ చంపుతారేమో?'.. చంద్రబాబు ధ్వజం
CM Jagan 2019 లో అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ మోహన్ రెడ్డి తన 'విధ్వంసక పాలన'ను ఆవిష్కరించారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రజా వేదికని కూల్చివేయడం సహా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన రాజధాని అమరావతిని వినాశకర నిర్ణయాలతో నాశనం చేశాడని దుయ్యబట్టారు. రాజధానికి సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టుల తీర్పులను గౌరవించే బదులు వివిధ మార్గాల ద్వారా తీర్పులను తప్పించుకుంటున్నాడని ధ్వజమెత్తారు. న్యాయవ్యవస్థను, న్యాయమూర్తులను భయపెట్టడానికి తన పార్టీ నాయకుల ద్వారా వారిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా న్యాయవ్యవస్థ దీనిపై సుమోటోగా విచారణ చేపట్టి సీబీఐని విచారణకు ఆదేశించిందని గుర్తుచేశారు. ఎన్నికల ప్రక్రియలను అణగదొక్కేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నాలు నియంతల నిర్ణయాలను దాటిపోయాయని చంద్రబాబు విమర్శించారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి నిరక్షరాస్యులను సైతం పట్టభద్రులుగా నమోదు చేశారని ఆక్షేపించారు. ఓటర్ల నమోదులో నిమగ్నమైన ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేస్తూ ఎన్నికల ప్రక్రియను తారుమారు చేస్తున్నారని.., వీటికి వాలంటీర్లను వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. పౌరుల హక్కులు, గోప్యతకు భంగం కలిగించే విధంగా వాలంటీర్ల ద్వారా ప్రతి వ్యక్తి వ్యక్తిగత డేటాను సేకరించారని ఆరోపించారు. రాష్ట్రంలో 250 కుపైగా దేవాలయాల పై దాడులు జరిగాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ గా హిందూయేతర మతాన్ని విశ్వసించే వారిని సిఎం జగన్ పలుమార్లు నియమించారని ఆరోపించారు. రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు ఆస్తులు,చర్చి ఆస్తులు అన్యాక్రాంతం సర్వసాధారణం అయ్యిందని ధ్వజమెత్తారు.
Personal Attack ప్రతిపక్ష నాయకుడైన తనపై వైసీపీ నాయకులు పలుమార్లు భౌతిక దాడి, నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే తన భద్రతను భారీగా తగ్గించారని.., హైకోర్టు సూచనలతో కొంత భద్రత కొనసాగించారన్నారు. డీఎస్పీ (DSP) ర్యాంక్‌లోని ఇద్దరు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్లు తన భద్రతకు ఉండవలసి ఉన్నా..., ప్రభుత్వం ఒక్క డీఎస్పీ స్థాయి వారినే భద్రతకు కేటాయించిందని పేర్కొన్నారు. 2021 సెప్టెంబర్ లో మంత్రి జోగి రమేష్ తన అనుచరులతో కలిసి కర్రలు, రాళ్లు, ఇనుప రాడ్‌లతో తనను చంపుతామని బెదిరిస్తూ తన నివాసంపై దాడి చేశారని.., అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా అతనికి మంత్రి పదవిని బహుమతిగా ఇచ్చారని మండిపడ్డారు. తాను రాష్ట్రం లో పర్యటనకు వెళ్లిన ప్రతిసారీ, ప్రజల్లోనూ తనపై దాడి చేశారని ఆరోపించారు. పోలీసుల పర్యవేక్షణలోనే వైసీపీ గుంపు తనపై రాళ్లు రువ్వుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి పార్లమెంటరీ ఉప ఎన్నికల ప్రచారంలో తనపై రాళ్లు రువ్వారని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీలు బహిరంగ సభలు నిర్వహించకుండా ఉండేందుకు ప్రభుత్వం జీఓ నెం.1ని తీసుకొచ్చిందని విమర్శించారు. గతంలో నందిగామలో జరిగిన దాడిలో సీఎస్ఓ , యర్రగొండపాలెం వద్ద జరిగిన దాడిలో ఎన్ఎస్జీ టీమ్ కమాండర్ గాయపడ్డారని గుర్తుచేశారు.
Irrigation Projetc జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన నీటిపారుదల ప్రాజెక్టుల స్థితిగతులను ప్రజలకు వివరించడానికి 10 రోజులపాటు రాష్ట్రంలో పర్యటించిన సమయంలో తనపై దాడులు జరిగాయని చంద్రబాబు వివరించారు. పోలవరం ప్రాజెక్టు కోసం తాను చేసిన కృషి ని జగన్ నాశనం చేశారని...., ప్రాజెక్టు సందర్శించినప్పుడు ప్రాజెక్ట్ సైట్ రాజధాని అమరావతిలోని నేటి శిథిలాల మాదిరిగానే కనిపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాంతంలోని ప్రభుత్వ ప్రాజెక్టుల కాంట్రాక్టులలో ఎక్కువ భాగం మంత్రి, కాంట్రాక్టర్ పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి అక్రమ మార్గాల ద్వారా దక్కించుకున్నారని ఆరోపించారు. గాలేరు-నగరి సుజల స్రవంతి (GNSS) పేరుతో పూర్తిగా అనవసరమైన ప్రాజెక్ట్‌ను రూపొందించి మంత్రికి పనులు అప్పగించారని ధ్వజమెత్తారు. తన పర్యటన ద్వారా వారి అవినీతి పనులు బయటికి రావడంతో ఆగస్టు 4న అంగళ్లులోని మూడు రోడ్ల కూడలిలో తనపై దాడికి చేసి చంపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. వైసీపీ గూండాల నుండి తనను రక్షించడానికి NSG కమాండోలు వారి బుల్లెట్ రెసిస్టెంట్ (BR) షీట్‌లు అడ్డుగా పెట్టారన్నారు. తన పర్యటన షెడ్యూల్‌ను సంబంధిత జిల్లా పోలీసు అధికారులతో ముందుగానే పంచుకున్నప్పటికీ... స్థానిక పోలీసులు మద్యం సీసాలు, రాళ్లు, కర్రలు, ఇనుప రాడ్‌లతో ఉన్న వైసీపీ గూండాల కట్టడి చేయలేదని ధ్వజమెత్తారు. తాను అంగళ్లు చేరుకోవడానికి మూడు గంటల ముందు, CSO, NSG కమాండింగ్ ఆఫీసర్ తన కాన్వాయ్ పై దాడికి ఆస్కారం ఉన్నట్లు స్థానిక DSP, SPలకి సమాచారం అందించినా..., ఏమాత్రం చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తనపై హత్యా దాడికి పాల్పడిన వారిని వదిలేదసి తనపైనే హత్యాయత్నం ఆరోపణపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని మండిపడ్డారు. తనపై పదే పదే జరుగుతున్న దాడులు, వాటి వెనుక నేరపూరిత కుట్రను వెలికితీయడానికి సీబీఐ తో విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో వైసీపీ గూండాల నిరంతర దాడి కి ప్రజాస్వామ్యం గురవుతుందని చంద్రబాబు మండిపడ్డారు. ఏపిని అశాంతి నుండి రక్షించడానికి తగు ఆదేశాలు జారీచేయాలని రాష్ట్రపతి, ప్రధాని లను ఆయన కోరారు. లేఖలో ప్రస్తావించిన ఆయా ఘటనలకు సంబంధించిన ఆధారాలు లేఖకు జత చేశారు. 9 పేజీల లేఖతో పాటు ఆయా ఘటనలకు సంబంధించిన వివరాలతో 75 పేజీల డాక్యుమెంట్ ను, వీడియోలను పంపుతున్నట్లు పేర్కొన్నారు