Chaganti Koteswara Rao is Motivating the Students: సంకుచిత భావాలకు దూరంగా.. చిన్నపాటి ఒత్తిళ్లను తట్టుకోలేని పరిస్థితుల నుంచి విద్యార్ధులు సహనం, సంయమనంతో ముందడుగు వేయాలని ప్రవచనకర్త, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావు ఉద్భోదించారు. ఓర్పుతో ఉండడం చేతకానితనం కాదని.. గొప్ప నేర్పునకు సంకేతమని వివరించారు.
పాఠ్యాంశాలు ఒక్కటే చదువు కాదు.. మహనీయుల జీవిత విశేషాలు, సమాజం ఇతర అంశాలపైనా లోతైన పరిశీలన, పరిశోధన, అనుశీలన అవసరమని పేర్కొన్నారు. విజయవాడ కేబీఎన్ కళాశాల ఆవరణలో విద్య - నైతిక విలువలు అంశంపై విద్యార్ధులు, వారి తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం, మాజీ ప్రధాని లాల్ బహదూర్‌శాస్త్రి, ప్రముఖ గాయని ఎం.ఎస్.సుబ్బలక్ష్మి, నోబెల్ బహుమతి గ్రహీత మేడం క్యూరీ, సర్ అర్దర్‌కాటన్, అరబిందో, చంద్రశేఖర సరస్వతి, రవీంద్రనాథ్‌ఠాగూర్ తదితరుల జీవిత విశేషాలను తన ప్రసంగంలో ఉటంకించారు.
పురాణాల్లోని అంశాలను ప్రస్తావించారు. పుస్తకం చదవడం ఒక్కటే గొప్ప విద్య కాదని.. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సహచరుల పట్ల గౌరవభావంతో మెలగడం ముఖ్యమని తెలిపారు. చదువు మనిషిలో కొత్త శక్తిని నింపుతుందని.. నైతిక విలువలు పెంపొందింపజేస్తుందని తెలిపారు. లోకంలో.. బయట ధనం ఉంటే.. దానికి అనేక రకాలైన ప్రమాదాలు ఉంటాయని.. ఆ ధనాన్ని దొంగలు ఎత్తుకుపోవచ్చు.. లేదా అన్నదమ్ములు వాటా అడగచ్చు.. లేదా ప్రభుత్వం పన్నులు విధించి కొంత తీసుకోవచ్చు.. ఖర్చు పెడితే తగ్గిపోవచ్చు.
కానీ విద్యాధనం అలాంటిది కాదని తెలిపారు. దానిని ఏ దొంగా ఎత్తుకుపోలేడు. ఏ అన్నదమ్ముడూ పంచుకోలేడు. ఏ ప్రభుత్వం కూడా.. పన్నులు వేయలేదు.. పైగా మిగిలిన ధనం ఖర్చు పెడితే తగ్గిపోతుంది.. కానీ విద్యా ధనానికి ఉన్న గొప్పతనం ఏంటంటే.. ఎంత ఖర్చు పెడితే అంత పెరుగుతూ ఉంటుందని చాగంటి కోటేశ్వరరావు అన్నారు.
విద్య ఎంత మందికి బోధిస్తున్నారో.. అంతగా విద్య పెరుగుతూ ఉంటుందని.. అన్ని ధనములలోకి గొప్ప ధనం.. విద్యాధనమే అని అన్నారు. విద్యతో పాటు ఉండాల్సిన ప్రధానమైన లక్షణం ఏంటంటే నైతిక విలువలు కలిగి ఉండి తీరాలని.. విద్య ద్వారా పొందిన శక్తిని లోకానికి మంచిని చేయడానికి ఉపయోగించాలని ఉద్భోదించారు.
"మహాత్ముల జీవిత చరిత్రలను చదివితే విద్యార్థులకు కలిగే ప్రథమ ప్రయోజనం ఏంటంటే.. ఒత్తిడిలకు లోనుకాకుండా ఉంటారు. ప్రస్తుతం ఏదైనా కొత్త విషయాన్ని చరవాణిలో చూసినప్పుడు.. అది ఎంత నిజం.. ఎంత అబద్ధం ఆలోచించాలి. మొత్తం ప్రసంగంలోని.. ఏదో ఒక మాటను చూడటం.. ఒక గంట అయ్యేటప్పటికి దానిని ప్రచారం చేసేసి.. అశాంతికి కారణం అవుతున్నారు. వ్యక్తులకు సంయమనం కావాలి". - చాగంటి కోటేశ్వరరావు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త
ఇవీ చదవండి: