Central Teacher Eligibility Test: దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహించిన సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు విజయవాడలో ఆగిపోయింది. నగర సమీపంలోని కానూరు సైలేష్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థలో నిర్వహించిన ఈ పరీక్షకు సాంకేతిక సమస్య ఎదురైంది. ఉదయం 9గంటల 30 నిమిషాలకు జరగాల్సిన పేపర్-1 పరీక్ష 10 గంటల 30 నిమిషాలకు ప్రారంభమైందని.. సాంకేతిక లోపంతో తాము పరీక్షా పత్రాన్ని సబ్మిట్ చేయలేకపోయామని అభ్యర్థులు వాపోయారు.
మధ్యాహ్నం జరగాల్సిన పేపర్-2 పరీక్షకు కనీసం సైట్ కూడా ఓపెన్ కాలేదన్నారు. చాలా మంది అభ్యర్థులు తమకు సైట్ ఓపెన్ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తామంతా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చామని.. తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నారని.. వేల రూపాయలు ఖర్చు చేసి పరీక్ష కేంద్రానికి వచ్చినా ఫలితం లేకపోయిందని వాపోయారు. ఏ ప్రాంతం వారికి ఆ జిల్లాలోనే తిరిగి పరీక్ష నిర్వహించాలంటూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఈ విషయమై సైలేష్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ ప్రతినిధిని సంప్రదించగా.. సాంకేతిక సమస్యతో పరీక్ష జరలేదని, తాము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి తిరిగి పరీక్ష నిర్వహిస్తామన్నారని తెలిపారు.
"మధ్యాహ్నం వెళ్లి చూస్తే ఉదయం జరగిన పేపర్ 1 పరీక్ష సబ్ మిట్ అవ్వలేదు. అడిగితే రీస్టార్ట్ చేసి సబ్ మిట్ చేశారు. సబ్ మిట్ అయ్యిందో లేదో తెలీదు." -అభ్యర్థి
"నేను హైదారాబాద్ నుంచి వచ్చాను. ఉదయం జరగాల్సిన పరీక్ష ఆలస్యంగా జరిగింది. సాయంత్రం 5 గంటలకు వరకు వేచిచూశాం. అప్పటికీ పరీక్ష స్టార్ట్ అవ్వలేదు. అడిగితే సర్వర్ బిజీగా ఉంది అన్నారు. ఎంతో దూరం నుంచి చార్జీలు, పిల్లల్ని వదిలేసి వచ్చాము." -అభ్యర్థి
"సీబీఎస్ సీ నుంచి మాకు మెయిల్ వచ్చింది. పరీక్ష రద్దు చేయమని. అభ్యర్థులకు మెయిల్ పంపి పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఈ సెంటర్ లో రాసిన వారికి తరువాత ఏ సెంటర్ అయినా ఇవ్వచ్చు. వాళ్లకు అనుకూలంగా ఉన్న సెంటర్లే ఇస్తారని నేను అనుకుంటున్నాను." -కృష్ణారెడ్డి, శైలేష్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ, ఎండీ
ఇవీ చదవండి