Gannavaram Airport Cargo Services :గన్నవరం విమానాశ్రయం నుంచి కార్గో సేవలు నిలిచి పోయాయి. విమానాశ్రయం నుంచి ఇతర నగరాలకు సరుకు పంపించే సేవలను నిలిపివేశారు. ప్రస్తుతం ఇతర నగరాల నుంచి మాత్రమే గన్నవరానికి సరకులు వస్తున్నాయి తప్పా గన్నవరం నుంచి ఇతర నగరాలకు వెళ్లటం లేదు. ఈ సేవలు గన్నవరం నుంచి పూర్తిగా ఆగిపోయాయి. కొత్తగా వచ్చిన నిబంధనల ప్రకారం ఇక్కడి నుంచి సరుకు పంపించేందుకు అనుమతి లేదని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) తేల్చి చెప్పింది. అనుమతులు తీసుకురావటానికి ప్రయత్నించిన సదరు కార్గో సంస్థ కూడా చివరికి ప్రయత్నాన్ని మానుకుంది. రాష్ట్ర ప్రభుత్వ, విమానాశ్రయ అధికారుల నుంచి కార్గో నిర్వహకులకు సహకారం లేదని.. నష్టాలతో నిర్వహించలేక అక్కడి నుంచి తొలగిపోవాలనే అలోచనలో ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఇతర నగరాలకు ఇక్కడి నుంచి సరుకు పంపించే అవకాశం లేకపోవటంతో విమానాశ్రయానికి వస్తున్న సరుకును కార్గో సిబ్బంది తిరిగి పంపిస్తున్నారు. విమానాశ్రయాల్లోని సరకు రవాణా సేవల్లో భద్రతా ప్రమాణాలను మెరుగు పరుస్తూ.. రెగ్యులేటరీ ఏజెన్సీ వ్యవస్థను బీసీఏఎస్ ఈ ఏడాది ఆరంభంలో ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా విమానాశ్రయాల్లో సరుకు రవాణా సేవలు అందిస్తున్న సంస్థలు.. గతంలో ఇచ్చిన అనుమతులను పునరుద్ధరించుకోవాలంటూ, బీసీఏఎస్ గత ఏడాది మధ్యలోనే సూచించింది. ఆరు నెలలు గడిచిన నూతన అనుమతులు తీసుకోకపోవడంతో జనవరి 01 నుంచి పూర్తిగా కార్గో సేవలను గన్నవరం విమానాశ్రయంలో బీసీఏఎస్ నిలిపివేసింది. చివరికి ఎలాగోలా మళ్లీ ప్రయత్నించినప్పటికీ.. కేవలం బయట నుంచి సరకును ఇక్కడికి తెచ్చేందుకు మాత్రమే బీసీఏఎస్ అనుమతినిచ్చింది. ఇక్కడి నుంచి పంపించేందుకు మాత్రం అనుమతి ఇవ్వలేదు.
గన్నవరం నుంచి ఎయిర్ కార్గో సేవలు ఆరంభించేందుకు గత రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తీవ్రంగా ప్రయత్నించి.. కేంద్ర పౌర విమానయాన శాఖతో సంప్రదింపులు జరిపి.. అనుమతులు తీసుకువచ్చారు. 2018 ఆగస్టు నుంచి సేవలు ఆరంభించారు. విజయవాడ, గుంటూరు నగరాలలో ఉండే పారిశ్రామిక, వ్యాపార, వర్తక, మత్స్య, ఇతర వాణిజ్య పంటల ఉత్పత్తుల రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆంధ్రా ఛాంబర్ ఆఫ్ కామర్స్, అపెడా, ఎంపెడా, పారిశ్రామికవేత్తలు, రైతులు, వ్యాపారులను కలిసి ఎయిర్ కార్గో వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఇక్కడి నుంచి కార్గో సేవలు అందుబాటులో ఉన్న నగరాలు.. అక్కడికి సరుకు రవాణా చేయాటానికి అయ్యే ఛార్జీలు, సరుకు రవాణాకు పట్టే సమయం, ప్రయోజనాలు ఇలా ప్రతి విషయంపై అవగాహన కల్పించారు. ఇక్కడి నుంచి మత్స్య ఉత్పత్తులకు దిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఉత్తరాఖండ్, సహా ఇతర రాష్ట్రాలలో డిమాండ్ అధికంగానే ఉంది. ఉదయం ఇక్కడి నుంచి పంపిస్తే.. మూడు నాలుగు గంటల్లో నేరుగా దిల్లీకి చేరిపోయేది. ఇందుకోసం అక్కడ వ్యాపారులు, ఇక్కడి రైతుల మధ్య అనుసంధానం కుదిర్చేందుకు గత ప్రభుత్వం ప్రయత్నాలు జరిపింది. దీంతో నెమ్మదిగా ఎయిర్ కార్గోకు డిమాండ్ పెరిగింది.
ప్రస్తుతం కార్గో సేవలు ఇక్కడి నుంచి ఆగిపోయినా.. వాటిని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరగడం లేదు. సరుకు రవాణాకు గన్నవరం చుట్టుపక్కల అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గతంలో ప్రతినెలా 250 టన్నులకు పైగా సరుకు ఇతర నగరాలకు ఎగుమతి, దిగుమతి అయ్యేది. గన్నవరం నుంచి పత్యేకంగా కార్గో సర్వీసులను నడకపకపోయినా.. ప్రయాణికుల కోసం నడుపుతున్న విమానాల్లోనే ముంబయి, దిల్లీ, బెంగళూరు, చెన్నై సహా పలు నగరాలకు సరకును గతంలో ఇక్కడి నుంచి పంపించారు. ఇతర నగరాల నుంచి కూడా అంతకు రెట్టింపు పరిమాణంలో ఇక్కడికి సరుకు వస్తుండేది. గడిచిన మూడు సంవత్సరాలుగా.. క్రమంగా ప్రయాణికుల విమాన సర్వీసులు తగ్గిపోతూ వచ్చాయి. దీంతో సరకు రవాణా కూడా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం పూర్తిగా ఇటునుంచి పంపించడం ఆపేశారు.
ఇవీ చదవండి :