Special Status: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందని ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు విమర్శించారు. ఈ అంశంపై రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయకపోవడం దారుణమని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు కోరుతూ అనంతపురం నుంచి ఇచ్చాపురం వరకు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర విజయవాడకు చేరుకుంది.
ఈ సందర్భంగా విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో సభ నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్న ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని కేంద్రాన్ని ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ఎంపీలు పార్లమెంట్లో ప్రశ్నించకపోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం బీజేపీకి మద్దతు తెలుపుతున్నాయని విమర్శించారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాలని కోరారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పది సంవత్సరాలపాటు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను గాలికొదిలేసిందని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని లేకపోతే చలో దిల్లీ కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఇవీ చదవండి: