BJP state president Somu Veerraju comments: రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనను గాలికి వదిలేసి.. అభివృద్ధిని విస్మరించి.. ఓ కార్పొరేట్ కంపెనీ తరహాలో వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల వారిని ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటోందన్నారు. ఏప్రిల్ నెలలో విజయవాడలో ఎస్సీల సమస్యల పరిష్కారం కోసం భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించారు.
విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నేడు కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దేవానంద్ అధ్యక్షత వహించగా.. గుజరాత్ ఎమ్మెల్యే, ఎస్సీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి శంభు నాథ్ తొండి యా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం సోము వీర్రాజు మాట్లాడుతూ.. ఇప్పటికే ఎస్సీ ఉప ప్రణాళిక నిధుల కోసం బీజేపీ 48 గంటల దీక్ష చేపట్టిందని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీనేనని.. జగన్ ప్రభుత్వంపై గట్టిగా గళమెత్తే కార్యక్రమాలన్ని కొనసాగిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి లేక.. అంతా తిరోగమనం పాలైందన్నారు. ఇప్పటివరకూ రాష్ట్రం ప్రభుత్వం దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రస్తుతం వైన్ మాఫియా, శాండ్ మాఫియా చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా అవినీతికి పాల్పడుతూ.. ట్రేడింగ్ కంపెనీ మాదిరి ప్రభుత్వం తయారైందని దుయ్యబట్టారు.
అనంతరం గుజరాత్ ఎమ్మెల్యే, ఎస్సీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి శంభు నాథ్ తొండియా మాట్లాడుతూ.. 2024లో అధికారంలోకి రావడానికి బీజేపీకి అన్ని అర్హతలున్నాయన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎస్సీలకు అనేక కార్యక్రమాలు చేస్తున్నారని, అంబేద్కర్ ఆలోచనలతోనే బీజేపీ ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. ఎస్సీ ఉప ప్రణాళిక నిధులను దారి మళ్లిస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు. సమావేశంలో దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు, జగనన్న కాలనీల పేరుతో భూములను లాక్కోవడం వంటి అంశాలపై చర్చించామన్నారు.
ఈ సమావేశం ద్వారా ఎస్సీ కార్పొరేషన్ నిధులను రద్దు చేసి, 26 పథకాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 13న అన్ని జిల్లాల్లో రద్దు చేసిన ఎస్సీ కార్పొరేషన్ పథకాల కోసం నిరాహార దీక్షలు నిర్వహిస్తామన్నారు. మార్చి 1 నుంచి ఏప్రిల్ 13 వరకు రాష్ట్రంలోని అన్ని పంచాయతీలలో 'నరేంద్ర మోదీ అభివృద్ధి మాట - దళిత ప్రగతి బాట' అనే పేరుతో బహిరంగ సభలు జరపాలని నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీనే. సాంఘిక, ఆర్ధిక అంశాల మీద జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అన్ని మోర్చాల్లో కార్యక్రమాలను నిర్వహిస్తాం. అందుకోసం ఒక తేదీని కూడా త్వరలోనే ప్రకటిస్తాం- సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
ఇవీ చదవండి