BJP leader Lanka Dinakar Allegations on Jagan About Gundlakamma Reservoir: రాష్ట్ర ప్రభుత్వం కనీసం మూడు కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయనందునే గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్ కొట్టుకుపోయిందని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. గత ఏడాది సెప్టెంబరు రెండో తేదీన ఓ గేటు కొట్టుకునిపోయినా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం సరైన మరమ్మత్తు పనులు చేయించలేదని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంక దినకర్ (BJP leader Lanka Dinakar) విమర్శించారు. గుండ్లకమ్మ ప్రాజెక్టును గండ్లకమ్మ ప్రాజెక్టుగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద మొత్తంలో నీరు సముద్రం పాలవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రవీడకపోవడం దౌర్భాగ్య పాలనకు నిదర్శనంగా ఉందని దుయ్యబట్టారు.
మరో సారి కొట్టుకుపోయిన గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు-జలాశయాన్ని గాలికొదిలేసిన వైసీపీ ప్రభుత్వం
లీకుల వల్ల నీరు సముద్రంపాలు: పాడైన గేట్లు మరమత్తు కోసం మూడు కోట్ల రూపాయలు సర్దుబాటు చేయలేక- రెండేళ్లు తాత్సారం చేశారని ధ్వజమెత్తారు. నాడు పులిచింతల, నేడు గుండ్లకమ్మ లీకుల వల్ల నీరు సముద్రం పాలు కావడానికి ప్రాజెక్టుల నిర్వహణ లోపమే కారణమన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టులో (Gundlakamma project) ఇప్పటికి రెండు గేట్లు కొట్టుకుపోయాయని ఇతర గేట్ల నుంచి లీకేజీలు అవుతున్నా పాలకులు చోద్యం చూస్తున్నారని అన్నారు. ఒంగోలు పట్టణానికి నిత్యం సురక్షిత మంచినీరు అందించేందుకు అమృత్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం 430 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని గుర్తు చేసారు.
గుండ్లకమ్మ నీరు ఒంగోలు పట్టణంలో ప్రతి ఇంటికి ప్రతి రోజు త్రాగునీరు అందించడమే లక్ష్యంగా కేంద్రం నిధులు ఇస్తూంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ఆందోళన కలిగిస్తోందన్నారు. గుండ్లకమ్మ కాలువల బండింగ్, రివిట్మెంట్ పూర్తి చేయకుండా ప్రాజెక్టు పూర్తి చేసినట్టు పాలకులు గొప్పలు చెప్పుకుంటున్నరని అన్నారు. గతంలో 150 కోట్ల రూపాయల ప్రాజెక్టుగా మొదలై ధనయఙ్ఞం వల్ల 600 కోట్ల రూపాయలకు చేరుకున్నా- లీకులతో పూర్తి అయినట్లు వైసీపీ ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదంగా ఉందని లంక దినకర్ దుయ్యబట్టారు.
గుండ్లకమ్మ ఉనికికే పెను ముప్పు.. ఇసుక తవ్వకాలకు సర్వ సిద్దం
Project Third Gate Washed Away Last Year: గత ఏడాది ఆగస్టులో గుండ్లకమ్మ రిజర్వాయర్ (Gundlakamma Reservoir) మూడో గేటు కొట్టుకుపోయింది. అప్పట్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రాజెక్టును సందర్శించి నెల రోజుల్లో కొత్త గేటు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రిజర్వాయర్ నిర్వహణకు నిధులు మంజూరు చేస్తామన్నారు. 15 గేట్లను పరిశీలించి సమస్యలు ఉంటే సరిదిద్దుతామన్నారు. ఆ మాటలన్నీ నీటిమాటలయ్యాయి. అప్పటినుంచి నిర్వహణను అస్సలు పట్టించుకోకపోవడంతో ఇప్పుడు రెండో గేటు కొట్టుకుపోయింది. ప్రాజెక్టులో ఉన్న నీరంతా వృథాగా సముద్రంలోకి పోతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థత వల్లే గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు వరుసగా కొట్టుకుపోతున్నాయని ప్రతిపక్ష నేతలు (Opposition leaders on Gundlakamma project) మండిపడుతున్నారు.