Aqua Farmers Fire on CM Jagan: ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. దాణా ధరలు, ఉత్పత్తి వ్యయం పెరగడంతో కుయ్యో మొర్రో అంటున్నారు. రొయ్యకు గిట్టుబాటు ధర దక్కక ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు లక్షన్నర రూపాయలు నష్టపోతున్నామని రైతులు గుండెలు బాదుకుంటున్నారు. తాము అధికారంలోకి వస్తే ఆక్వా రైతులను ఆదుకుంటామని హామీలిచ్చిన వైఎస్ జగన్ తమను దారుణంగా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నష్టాల్లో కూరుకుపోతున్న ఆక్వా రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Declining Production Shrimp in AP: రొయ్యల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన రైతులు ప్రస్తుతం కుయ్యో మొర్రో అంటున్నారు. రొయ్యకు మద్దతు ధర నిర్ణయిస్తామని, ఎన్నికల ముందు ఆశలు కల్పించిన జగన్, అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచారని ఆవేదన చెందుతున్నారు. మూడేళ్లుగా రొయ్యకు సరైన ధర లేక తీవ్ర నష్టాలను చవిచూస్తున్నామని వాపోతున్నారు. రాయితీ విద్యుత్ సరఫరాలో కోత, ట్రూఅప్ ఛార్జీల పేరుతో అదనంగా వడ్డిలు చెల్లిస్తూ నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. గతంలో 700 రూపాయలు కరెంటు బిల్లు చెల్లించిన రైతుల వద్ద నుంచి ఇప్పుడు 3వేలు బాదుతున్నారని, 11 ఎకరాల చెరువుకు, గతంలో గరిష్టంగా 25వేలు విద్యుత్ బిల్లు వస్తే, ఇప్పుడది ఏకంగా 80వేల వరకూ చెల్లించాల్సి వస్తోందని కన్నీరుమున్నీరవుతున్నారు.
Electricity Subsidized Connections Down Under YCP Regime: వైసీపీ హయంలో రోజురోజుకి ఆక్వా రైతు విద్యుత్ రాయితీ కనెక్షన్ల సంఖ్య తగ్గిపోయింది. 2021-22 సంవత్సరంలో 62వేల రాయితీ విద్యుత్ కనెక్షన్లుంటే, 2022-23లో ఆ సంఖ్య 29 వేల 324కు పడిపోయింది. 2019-20 సంవత్సరంలో రొయ్య రైతులకు విద్యుత్‌పై 577కోట్ల రూపాయల రాయితీ ఇస్తే, 2022-23లో అది 415 కోట్లకే పరిమితమైంది. వంద కౌంట్ రొయ్య కిలో ఉత్పత్తి చేయాలంటే అన్నీ కలిపి 275 రూపాయల దాకా ఖర్చవుతుంది.
CM Jagan Does Not Care Aqua Farmers: కానీ, మార్కెట్‌లో కిలో రొయ్య ధర 210 నుంచి 215 రూపాయలు మాత్రమే పలుకుతోంది. 30 కౌంట్ రొయ్య ధర కిలో 370 మాత్రమే ఉంది. కనీసం 500 రూపాయలైతే గానీ గిట్టుబాటు కాదని రైతులు అంటున్నారు. రొయ్యల ఎగుమతిలో ఏపీ రైతుకు ఈక్వెడార్ నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. మనకంటే తక్కువ ధరకే ఎగుమతి చేసేందుకు ఆ దేశం ముందుకొస్తోంది. అదే సమయంలో మూడేళ్లుగా ఉత్పత్తిని భారీగా పెంచుకుంది. గతంలో వంద కౌంట్ రొయ్య ఎక్కువగా చైనాకు ఎగుమతి అయ్యేది. ఇప్పుడు.. 55శాతం ఈక్వెడార్ నుంచే చైనా దిగుమతి చేసుకుంటోంది. భారత్ నుంచి ఏటా 3.5 లక్షల టన్నులే ఉంటోంది. ఆ ప్రభావం మన ఆక్వా రైతుపైనా పడింది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా రైతుకు ఊరటనిచ్చే చర్యలు తీసుకోవటం లేదని రైతులు మండిపడుతున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ప్రశ్నార్థకంగా ఆక్వా రంగం.. అప్పుల్లో కూరుకుపోయిన రైతులు
Aqua Farmers Suffering Due Lack Support Price: సీఎం జగన్ తీరు వల్ల కృష్ణా, ఉమ్మడి పశ్చిమ గోదావరి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో రొయ్యల రైతులు సాగు అంటేనే భయపడుతున్నారు. 3 పంటలు వేసినా, ప్రకృతి వైపరీత్యాల దెబ్బకు ఒక పంట చేతికి రావడమే గగనమవుతోంది. వ్యాపారులు సిండికేట్‌గా మారి, రొయ్య రైతు కష్టంతో బేరాలు ఆడుతున్నారు. ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడంతో ధరల్లో కోత వేస్తున్నారు. కిలోకు నికరంగా 60 రూపాయల వరకూ నష్టపోతున్నారు. సగటున ఎకరాకు రెండున్నర టన్నుల దిగుబడి ప్రకారం చూస్తే, ఒక్క పంటకు లక్షన్నర మేర నష్టాలు మూటగట్టుకుంటున్నారు. ఐదెకరాల్లో రొయ్యలు సాగు చేస్తే ఏడున్నర లక్షలపైనే నష్టం వస్తోంది. ఇక ఏవైనా వైరస్‌లు సోకితే, కనీసం ఖర్చులు చేతికి రావటం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
రాష్రం ప్రభుత్వ ప్రోత్సాహం కరవై, ఆంధ్రప్రదేశ్‌లో రొయ్యల సాగు విస్తీర్ణం క్రమక్రమంగా పడిపోతోంది. ఒకప్పుడు లక్షా 90వేల ఎకరాల్లో రొయ్యలు సాగు చేసేవాళ్లం. గత మూడేళ్లలో 20శాతం మేర తగ్గింది. అందుకు కారణాలు దాణా ధరలు సగటున 35 శాతానికి పైగా పెరిగాయి. రైతులం దాణా, ఇతర ఉత్పత్తుల్ని స్థానికంగా ఉండే వ్యాపారుల నుంచి అరువుకు తీసుకుంటాం. రొయ్యలు అమ్మాక సొమ్ము తిరిగిస్తారు. గతంతో పోల్చితే ఉత్పత్తి పడిపోవడంతో వ్యాపారులు అరువు ఇవ్వలేమని తేల్చి చెప్తున్నారు. చిన్న రైతులు సాగు చేయలేక చెరువుల్ని ఎండబెడుతున్నారు. -ఆక్వా రైతులు, ప్రకాశం జిల్లా
ఆక్వా రంగంలో రాష్ట్రాన్ని.. దేశానికే దిక్సూచిగా మారుస్తా: చంద్రబాబు