Chalo Vijayawada programme broken: జీతాలు పెంచాలంటూ 'చలో విజయవాడ' కార్యక్రమానికి అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు పిలుపునిచ్చారు. రాష్ట్రం నలువైపుల నుంచి విజయవాడకు విచ్చేసిన అంగన్‌వాడీ టీచర్లను, ఆశా కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకుని అరెస్ట్ చేశారు. అంతేకాకుండా, రోడ్లపై ఆందోళనలు చేయడానికి అనుమతుల్లేవని.. ప్రభుత్వ నిబంధలను అతిక్రమిస్తే, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో పోలీసుల తీరుపై అంగన్‌వాడీ టీచర్లు, కార్యకర్తలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతులు ఇచ్చినట్టే ఇచ్చి.. తమను అరెస్టులు చేయటం దారుణమని ఆవేదన చెందారు.
'చలో విజయవాడ' ధర్నాకు అంగన్‌వాడీలు పిలుపు: ఆంధ్రప్రదేశ్‌లోని అంగన్‌వాడీ బడుల్లో ఏళ్ల తరబడి విధులు నిర్వర్తీస్తున్న అంగన్‌వాడీ టీచర్లకు, ఆశా కార్యకర్తలకు.. సీఎం జగన్.. అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్రంలో కన్నా రూ. 1000 రూపాయలు అధికంగా వేతనం ఇస్తామని జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు హామీ ఇచ్చారన్నారు. ఇప్పుడు వేతనాలను పెంచాలని కోరితే.. తమను అరెస్ట్‌లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత మూడు నెలలుగా బిల్లుల చెల్లించకపోవటంతో నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం జీతాలను పెంచుతామని ఇచ్చిన హామీలను వెంటనే నేరవేర్చాలని డిమాండ్ చేస్తూ..ఈరోజు చలో విజయవాడ ధర్నాకు అంగన్‌వాడీ టీచర్లు, కార్యకర్తలు పిలుపునిచ్చారు.
విజయవాడలో అంగన్‌వాడీల అరెస్టులు: సీఐటియూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు చేపట్టిన చలో విజయవాడ మహాధర్నాకు భారీ సంఖ్యలో అంగన్‌వాడీ టీచర్లు, కార్యకర్తలు హాజరయ్యారు. రాష్ట్ర నలుమూలల నుంచి ధర్నా చౌక్‌కు చేరుకొని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అప్రమత్తమైన పోలీసులు అంగన్‌వాడీలను ఎక్కడికక్కడే అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్లకు తరలించారు. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేసి, కార్యకర్తలను అరెస్టులు చేశారు.
మరోవైపు అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలంటూ విజయవాడలోని గ్రామీణ నున్న పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో అంగన్‌వాడీలు చేపట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుని నున్న, అజిత్ సింగ్ నగర్‌లో ఉన్న స్టేషన్‌కి తరలించారు. దీంతో తమ సమస్యలను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకునే అనుమతిని కల్పించాలని పోలీసులను వేడుకున్నారు. అంగన్వాడీ కార్యకర్తలను, సీఐటీయూ అనుంబంధ సంఘాల నాయకులను అన్యాయంగా అరెస్టులు చేస్తే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్లు మాట్లాడుతూ..తమకు వేతనాలు పెంచుతామంటూ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దారుణంగా మోసం చేశారని ఆరోపించారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం.. తమకు రూ. 20వేల వేతనాన్ని ఇవ్వాలని, ప్రభుత్వ పథకాలను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కంటే రూ. వెయ్యి రూపాయలు ఎక్కువగా ఇస్తానని చెప్పి.. సీఎం జగన్ మాట తప్పారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు.
ఏలూరు రోడ్డును దిగ్బంధించిన అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు: ఏలూరు రోడ్డును అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు దిగ్బంధించారు. వాహనాల రాకపోకలను నిలువరించి.. ముఖ్యమంత్రి జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అంగన్వాడీ కార్యకర్తలను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై సీపీఎం నాయకులు మండిపడ్డారు.
కర్నూలులో అంగన్వాడీలను అడ్డగింత: కర్నూలు జిల్లా నుంచి విజయవాడకు రైలులో వెళ్తున్న అంగన్వాడీలను పోలీసులు అడ్డుకుని వారిని తిరిగి ఇళ్లకు పంపించారు. విజయవాడకు వెళ్లే ప్రధాన రహదారి వెంట చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మరోవైపు అన్నమయ్య జిల్లా రాజంపేట I.C.D.S. కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తల ధర్నా నిర్వహించారు. C.I.T.U. ఆధ్వర్యంలో చేపట్టిన చలో అమరావతి కార్యక్రమానికి బయలుదేరిన సుమారు 60 మంది అంగన్వాడీలను తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పోలీసులు అదుపులోకి తీసుకుని, అనపర్తి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ధర్నా కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవటాన్ని నిరసిస్తూ.. పోలీస్ స్టేషన్ వద్ద అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
కోనసీమ జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు అరెస్ట్: కోనసీమ జిల్లా రావులపాలెం జాతీయ రహదారిపై విజయవాడ వెళుతున్న అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సమాచారం అందుకున్న తెదేపా నాయకులు స్టేషన్ వద్ద వారికి మద్దతు తెలిపారు. రాజోలు, మలికిపురం పోలిస్ స్టేషన్లో వంద మంది అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు నిర్బంధించారు. ఈ నేపథ్యంలో అంగన్వాడీలు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. ఇదే సమయంలో బంధువుల ఇంట్లో ఓ కార్యాక్రమానికి వెళ్తున్న... పలువురు మహిళలను అంగన్వాడీ కార్యకర్తలనుకుని.. స్టేషన్ వద్దకు పోలీసులు తీసుకురావటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నంద్యాల జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళనలు: పోలీసుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ.. నంద్యాలలో అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ఈ ధర్నా చేపట్టారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయవాడలో తలపెట్టిన ధర్నాకు వెళుతుంటే.. తమను అరెస్టు చేయడం అన్యాయమని సీఐటీయూ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. అంగన్వాడీ కార్యకర్తల ధర్నాతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది.
అంగన్‌వాడీ టీచర్‌కు గుండెపోటు: చలో అసెంబ్లీ కార్యక్రమానికి వచ్చిన అంగన్వాడీ టీచర్ బుజ్జికి గుండెపోటు వచ్చింది. అప్రమత్తమైన ఆశా వర్కర్లు గుండెపోటుకు గురైన ఆమెను ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌కి తరలించారు. ఆసుప్రతిలో బెడ్లు ఖాళీ లేక డాక్టర్లు ఆమెను కూర్చోబెట్టి వైద్యం చేశారు. కనీసం బెడ్ కేటాయించి, తగు వైద్యం అందించాలని అంగన్వాడీ నేతలు డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆమెకు బెడ్‌ను కేటాయించి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
అరెస్టులతో నిండిపోయిన పోలీస్ స్టేషన్లు: సమస్యల పరిష్కారం కోసం అంగన్‌వాడీ నేతలు ఇచ్చిన 'చలో విజయవాడ' కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. విజయవాడకు భారీ సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు తరలివచ్చారు. దీంతో కొందరు కార్యకర్తలను పోలీసులు ఈడ్చుకెళ్లి అరెస్ట్‌లు చేశారు. మరికొంతమంది అంగన్వాడీ టీచర్లను, ఆయాలను అరెస్టులు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు, కళ్యాణమండపాలకు తరలించడంతో పోలీస్ స్టేషన్లలన్నీ అంగన్‌వాడీ టీచర్లతో, కార్యకర్తలతో కిక్కిరిసిపోయాయి.
ఇవీ చదవండి