AP Chief Electoral Officer Mukesh Kumar Meena on Deletes Voters Names: గత కొంత కాలంగా ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపులు, మార్పులు చేర్పుల అంశంపై అధికార వైసీపీ ప్రభుత్వం మీద టీడీపీ, జనసేనతో పాటు పలు పార్టీలు ఆరోణలు చేస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్.. దిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission of India) ఉన్నతాధికారులకు పదే పదే ఫిర్యాదులు చేశారు. ఇదే అంశంపై దాదాపు సంవత్సరం పాటు పోరాడారు. ఆయన పోరాట ఫలితమే అక్రమాలకు సహకరించిన అనంత జడ్పీ సీఈఓ భాస్కర్ రెడ్డి, గతంలో జడ్పీ సీఈఓగా పని చేసిన శోభా స్వరూపా రాణిపై చర్యలు తీసుకున్నారు. తాజాగా... రాష్ట్రంలో ఓట్ల తొలగింపూ.. ఓట్ల నమోదు ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియా సమావేశం నిర్వహించారు.
2022 జనవరి నుంచి ఓటర్ల జాబితాలోని అన్ని తొలగింపులపై పునఃపరిశీలన చేపట్టామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. 2022 జనవరి 6 తేదీ నుంచి ఇప్పటి వరకూ ఓటర్ల జాబితాలోని అన్ని తొలగింపులపై తనిఖీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిందని స్పష్టం చేశారు. ఈ నెల 2-3 తేదీల్లో విశాఖలో జరిగిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల సమావేశంలో ఈ అంశంపై సీఈసీ నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. ఓటర్ల జాబితాను పటిష్టంగా రూపొందించాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సూచనలు చేశారని తెలిపారు. ఓటర్ల బదిలీలు, మృతుల తొలగింపు, షిఫ్టింగ్, మార్పు చేర్పుల అంశాలను పునః పరిశీలన చేస్తున్నట్టు వివరించారు. అన్ని కేటగిరీల కిందా జాబితా నుంచి తొలగింపులకు సంబంధించి సరైన పత్రాలు ఉన్నాయో లేదో తేలుస్తామని వెల్లడించారు. పునః పరిశీలన కార్యక్రమానికి సంబంధించి ఈ నెల 9 తేదీనే అన్ని జిల్లాల కలెక్టర్లకూ మెమో జారీ చేసినట్టు వివరించారు.
ఓట్ల తొలగింపులన్నిటిపైనా బీఎల్ఓలు 100 శాతం క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినట్టు ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. వివిధ స్థాయిల్లో తొలగింపుల పునఃపరిశీలనకు ఈఆర్ఓలు, నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక అధికారులు నియమించారన్నారు. తొలగించిన ప్రతీ వెయ్యి ఓట్లలో ర్యాండమ్ గా పరిశీలన చేయాల్సిందిగా ఈఆర్వోను, నియోజకవర్గస్థాయిలో ప్రతీ 5 వందల ఓట్లలో ర్యాండమ్ తనిఖీలు చేసేందుకు ప్రత్యేక అధికారులు నియమించినట్టు ముఖేష్ కుమార్ మీనా వివరించారు. అటు జిల్లా కలెక్టర్ కూడా ర్యాండమ్ గా ప్రతీ వంద ఓట్లనూ పరిశీలించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చామన్నారు. ఈ ప్రక్రియ మొత్తం 2023 ఆగస్టు 30 తేదీనాటికి పూర్తి చేయాల్సిందిగా ఆదేశించామన్నారు. పునః పరిశీలన ప్రక్రియ పూర్తి అయ్యాక కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపుతామని ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు.
ఇప్పటికే ఓట్ల తొలగింపూ.. ఓట్ల తొలగింపు వ్యవహారం.. రంగంలోకి దిగిన చంద్రబాబు.. ఈ నెల 27న దిల్లీకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.