104 Employees: గ్రామాలు, పట్టణాల్లో అనారోగ్య సమస్యల పరిష్కారం కోసం, ఆరోగ్యం సలహాలు అందించడంలో 104 ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారు. 104 వాహనాల్లో విధులు నిర్వర్తిస్తున్న వాహన డ్రైవర్లు, డేటా ఆపరేటర్లు పలు సమస్యలతో బాధ పడుతున్నారు. ఎన్నికల ముందు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రిగ్లర్ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్.. గెలిచి నాలుగేళ్లు అవుతున్నా తమని రిగ్లర్ చేయలేదని 104 ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలీ చాలని జీతాలతో కుటుంబాన్ని పోషించడమే కష్టమవుతుంటే ఇచ్చే జీతాలు సక్రమంగా చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఏపీ 104 మొబైల్ మెడికల్ యూనిట్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఆరో మహాసభ నిర్వహించారు.
చెప్పిన పని చేయకపోతే వేధింపులు.. ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పడు హామీ ఇవ్వడంతో వారంతా మురిసిపోయి ఓట్లు వేశారు. గెలిచి 4 ఏళ్లు అయినా క్రమీబద్ధీకరణ మాటే ఎత్తడం లేదని వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 104 సేవల నిర్వహణ బాధ్యత ఓ ప్రముఖ ఫార్మా కంపెనీకి రాష్ట్రం ప్రభుత్వం అప్పజెప్పింది. ఈ కంపెనీ సకాలంలో జీతాలు విడుదల చేయడం లేదని 104 ఉద్యోగాలు వాపోతున్నారు. తమకు జీతం నుంచి పీఎఫ్, ఈఎస్ఐ డబ్బులు కట్ అవుతున్నా కంపెనీ చెల్లించాల్సిన డబ్బులు తమ నుంచి అధనంగా వసూళ్లు చేస్తోందని 104 డ్రైవర్లు, డేటా ఆపరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పై స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు తమపై కక్ష సాధిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. పై స్థాయి ఉద్యోగులు చెప్పిన పని చేయకపోతే వేధింపులకు గురిచేస్తున్నారని వాపోతున్నారు.
కుటుంబాలను ఎలా పోషించాలి.. ఇచ్చే అరకొర జీతాలు సమయానికి చెల్లించకపోతే తమ కుటుంబాలను ఎలా పోషించాలని 104 ఉద్యోగులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మూడు నెలలుగా జీతాలు చెల్లించలేదని ఆవేదన చెందుతున్నారు. తమకి ఇచ్చే వేతనం 16 వేల రూపాయల్లో పిఎఫ్, ఇఎస్ఐ కటింగ్‌లు పోనూ తమ చేతికి 13వేల ఒక వంద రూపాయలు వస్తున్నాయని 104 వాహన డ్రైవర్లు వాపోతున్నారు. 104 వాహనాల్లో డేటా ఆపరేటర్లుగా విధులు నిర్వర్తిస్తున్న వారికి 15 వేల రూపాయల వేతనంలో నుంచి పిఎఫ్, ఇఎస్ఐ డబ్బులు పోనూ 12 వేల రెండువందల 30 రూపాయలు అందుతుంది. ఈ జీతాలతో కుటుంబాలను ఎలా పోషించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కనీస వేతన చట్టం ప్రకారం తమకు వేతనాలు చెల్లించాలని 104 ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం.. 104 వాహనాల మరమత్తులు చేయించాలని, ఫిట్ నెస్, ఇన్సూరెన్స్‌లు చేయించాలని డ్రైవర్లు సంబంధిత అధికారలును కోరుతున్నారు. వైద్యారోగ్య శాఖలో ఖాళీ పోస్టుల భర్తీలో అర్హతను బట్టి తమకీ అవకాశం కల్పించాలంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కుటుంబ డాక్టర్ విధానంతో తమపై ఒత్తిడి పెంచాలని చూస్తున్నారని దాన్ని విరమించుకోవాలి విజ్ఞాప్తి చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కారం చేయాలని లేకపోతే భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇవీ చదవండి: