Anganwadi Workers Agitation in AP : 'ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానని ఎన్నికలకు ముందు ప్రతిపక్షనేతగా జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. మేనిఫెస్టోలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు మహిళలు కాదా? జగన్‌కు మేం ఓట్లు వేయలేదా' అంటూ అంగన్‌వాడీ కార్యకర్తలు ధ్వజమెత్తారు. 'ఎన్నికలకు ముందు తెలంగాణ కంటే అదనంగా వేతనాలు ఇస్తామని మాటిచ్చారు. అక్కడి ప్రభుత్వం అంగన్‌వాడీ కార్యకర్తలకు 13,500 రూపాయల వేతనం పెంచి రెండేళ్లవుతోంది. ఇక్కడ ఆ ఊసే లేదు. పైగా నాలుగు సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచి సంక్షేమ పథకాలన్నీ తీసేశారు. 200 రూపాయల యూనిట్ల విద్యుత్తు రాయితీని ఎత్తేసి ఎస్సీ, ఎస్టీ అంగన్‌వాడీ మహిళల నుంచి బిల్లులు కట్టించుకుంటున్నారు' అని వారు మండిపడ్డారు.
తాడేపల్లి ప్యాలెస్‌ను ముట్టడిస్తామని హెచ్చరిక : అంగన్‌వాడీల సమస్యల్ని పరిష్కరిస్తామని మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి శాసనమండలిలో చెప్పారని, ఇంత వరకు అతీగతీ లేదని అంగన్‌వాడీ కార్యకర్తలు దుయ్యబట్టారు. తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ కార్యకర్తలు కదం తొక్కారు. అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట 36 గంటల పాటు మహాధర్నా చేపట్టారు. సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ధర్నా మంగళవారం రాత్రి వరకు కొనసాగనుంది. రాబోయే మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం అంగన్‌వాడీ సమస్యలపై చర్చించి పరిష్కరించాలని అంగన్‌వాడీ కార్యకర్తల, సహాయకుల సంఘం(సీఐటీయూ) డిమాండ్ చేసింది. లేకపోతే పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని, నిరవధిక ఆందోళనకు సిద్ధమవుతామని, అవసరమైతే తాడేపల్లి ప్యాలెస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
భోజనాలు, నిద్ర టెంట్లలోనే : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ మహాధర్నా కార్యక్రమానికి అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు భారీగా హాజరయ్యారు. దీక్షా శిబిరాల వద్దే వంటావార్పు చేశారు. రాత్రి వారంతా అక్కడే నిద్రించారు. అమలాపురం, అనంతపురం కలెక్టరేట్ల ఎదుట అంగన్‌వాడీలు నల్లదుస్తులు ధరించి నిరసన తెలియజేశారు.
మెమోలిస్తామని బెదిరింపులు : ధర్నాకు హాజరైతే జులై నెల వేతనాన్ని నిలిపి వేస్తామని, మెమోలిస్తామని కొన్ని చోట్ల సీడీపీవోలు, సూపర్‌వైజర్ల ద్వారా ప్రభుత్వం బెదిరింపులకు దిగింది. దీన్ని అంగన్‌వాడీ కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. సంవత్సరం కంటే తక్కువ సర్వీసు ఉన్న కార్యకర్తలు పాల్గొంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామని బెదిరింపులకు దిగడం దుర్మార్గమని వారు అన్నారు. సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులను పంపి కేంద్రాల తాళాలివ్వాలని హెచ్చరించడం అన్యాయని అన్నారు. ఇలాంటి బెదిరింపులకు భయపడబోమని, సంఘటితంగా ప్రభుత్వ నిరంకుశ విధానాలను ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.
విజయవాడ ధర్నా చౌక్‌లో నిర్వహించిన మహా ధర్నా కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.ఎ.గఫూర్ మాట్లాడుతూ.. అంగన్‌వాడీల కోర్కెల దినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. వర్షాలు కురుస్తున్నా.. లెక్కచేయకుండా వేల మంది అంగన్‌వాడీలు తమ నిరసన తెలుపుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు అంగన్‌వాడీ కార్యకర్తలు మాట్లాడారు.