Nirasana Jagarana: విజయవాడలో ఉపాధ్యాయుల అరెస్టులను నిరసిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని విజయనగరం, పార్వతీపురంలో ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఈ నిరసన కొనసాగించారు. వైఎస్‌ఆర్ జిల్లా బద్వేల్‌లోని ఎమ్మార్సీ భవనం వద్ద యూటీఎఫ్ నాయకుల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం కూడలి, అద్దంకి కూడలిలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసనలు చేశారు. నిబంధనలకు లోబడి యూటీఎఫ్ నేతలు ధర్నా చేస్తుంటే ఎలా అడ్డుకుంటారని యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు తీవ్రంగా మండిపడ్డారు.
ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో నిరసన జాగరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ ప్రకాశం జిల్లా యూటీఎఫ్ నేతలు నిరసన చేపట్టారు. ఉపాధ్యాయుల అరెస్టుకు నిరసనగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట జాగరణ కార్యక్రమం చేపట్టారు. ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డ డబ్బులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోనూ ఉపాధ్యాయ సంఘాలు పోలీసులు తీరుకు నిరసనగా ధర్నా నిర్వహించాయి. నెల్లూరు లోని అన్నమయ్య సర్కిల్, ఆత్మకూరు లోనూ యూటీఎఫ్ నేతలు నిరసన చేపట్టారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉపాధ్యాయులు నిరసన జాగరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఉపాధ్యాయులపై పెట్టిన అక్రమ కేసులు తొలిగించాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా ఆందోళనకు సిద్ధపడిన ఉపాధ్యాయులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని సీపీఎం నేత బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా దౌర్జన్యాలకు పాల్పడం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు.
ఇవీ చదవండి: