VMC CORPORATORS TOUR ISSUE: విజయవాడ నగర పాలక సంస్థ కార్పొరేటర్లు చేపట్టిన విజ్ఞాన యాత్ర రాజకీయంగా వివాదాస్పదంగా మారింది. కార్పొరేటర్లతోపాటు వాళ్ల కుటుంబ సభ్యులు.. విజ్ఞానయాత్రకు వెళ్తున్నారంటూ విపక్షాలు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కార్పొరేటర్లతోపాటు వారి కుటుంబ సభ్యులు వెళ్లటం లేదని, అలా వెళ్లాల్సి వస్తే వారే సొంతంగా ఖర్చులు చెల్లించుకోవాల్సి ఉంటుందని పాలక సంస్థ అధికారులు తెలియజేశారు. అయితే, కార్పొరేటర్లు వెళ్తున్నది విజ్ఞానయాత్ర కాదు- అది విహారయాత్ర అంటూ సీపీఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయవాడ నగర పాలక సంస్థ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి
వివరాల్లోకి వెళ్తే.. జూన్ 1వ తేదీ 14వ తేదీ వరకూ వివిధ ప్రాంతాలకు విజ్ఞానయాత్ర పేరుతో విజయవాడ నగర పాలక సంస్థ కార్పొరేటర్లు వెళ్లనున్నారు. ఈ మేరకు కార్పొరేటర్లు వెళ్లుతున్న విజ్ఞాన యాత్ర నగరంలో చర్చనీయాంశంగా మారింది. కార్పొరేటర్లు, కార్యాలయ సిబ్బందితో పాటు కార్పొరేషన్‌తో సంబంధం లేకుండా పలువురు మహిళా కార్పొరేటర్ల భర్తలు కూడా ఈ యాత్రకు వెళుతున్నారంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి. యాత్రలో భాగంగా కార్పొరేటర్లతో పాటు వీఎంసీ సిబ్బంది 6 ప్రాంతాలను సందర్శించనున్నారు.
ఈ సందర్భంగా విజయవాడ నగర పాలక సంస్థ మేయర్ భాగ్యలక్ష్మీ మాట్లాడుతూ.. ''జూన్ నెల 1వ తేదీ నుంచి 14వ తేదీ వరకూ విజ్ఞాన యాత్ర పేరుతో 6 ప్రాంతాలను (కార్పోరేషన్లు) సందర్శించనున్నారు. ఆ 6 కార్పోరేషన్లు.. అస్సాం, మేఘాలయ, సిక్కిం, వెస్ట్ బెంగాల్, డార్జిలింగ్ ప్రాంతాలు. వీళ్లు అక్కడికి వెళ్లి ఆ కార్పోరేషన్లలో జరుగుతున్న పనితీరును, డెవలప్‌మెంట్‌ను సమీక్షిస్తారు. విజయవాడ నగరపాలక సంస్థ నుంచి దాదాపు 45 నుంచి 50 మంది వెళ్లబోతున్నారు. గత సంవత్సరం కూడా కార్పొరేటర్లు దిల్లీకీ, కశ్మీర్ వంటి ప్రాంతాలకు వెళ్లారు. కార్పొరేటర్లకు మాత్రమే కార్పోరేషన్ నుంచి నిధులు కేటాయించాము. ఇతరులకు కేటాయించలేదు. మహిళా కార్పొరేటర్లు వాళ్ల భర్తలను యాత్రకు తీసుకేళ్తే వారే సొంతంగా ఖర్చులు పెట్టుకోవాలి. ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు ముగ్గురు నుంచి ఐదుగురు ఆఫీసర్లను నియమించాం. బయటివాళ్లు చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలు'' అని ఆమె అన్నారు.
Tax Increase: వరుస పన్నుల బాదుడుతో బెంబేలెత్తుతున్న విజయవాడ వాసులు
వేసవి కాలంలో ప్రజలు మంచినీటి ఇబ్బందులు లేకుండా చేపట్టిన ముందస్తు ప్రణాళిక అమలు కావడం లేదని.. మాజీ కార్పొరేటర్ కోటేశ్వరరావు వ్యాఖ్యానించారు. నగరం చుట్టు పక్కల, శివారు కాలనీల ప్రజలు మంచి నీటికి తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంచినీటి ఎద్దడి విషయాన్ని ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు విజయవాడ నగరానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు, ఇతర నిధులు సుమారు ఐదారు వందల కోట్లు కార్పోరేషన్‌కు రావాల్సి ఉందన్నారు. అధికార వైసీపీ ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు వీటిని ప్రభుత్వం నుంచి రాబట్టడంలో విఫలమవుతున్నారనే విమర్శ ప్రజల్లో ఉందని ఆయన గుర్తు చేశారు.
మరోవైపు నిధులు అందుబాటులో లేక అభివృద్ది పనులు కుంటుపడుతున్నాయని విపక్షాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అస్సాం, మేఘాలయ, వెస్ట్ బెంగాల్, డార్జిలింగ్, సిమ్లా ప్రాంతాలకు వెళ్లి అక్కడ ఏం చేస్తారని ప్రశ్నించారు. ప్రజల మధ్య తిరిగితే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుస్తాయని.. వాటిని ఎలా పరిష్కరించాలో కూడా అర్ధం అవుతుందని హితవు పలికారు.
కౌన్సిల్లో వైసీపీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లకుపైగా అవుతోందని, గత సంవత్సరం కూడా వివిధ ప్రాంతాలకు కార్పోరేటర్లు పర్యటనకు వెళ్లారని.. మాజీ కార్పోరేటర్ దోనేపూడి శంకర్ గుర్తు చేశారు. గత సంవత్సర యాత్రలో కార్పోరేటర్లు ఏం గుర్తించారు..? నగరంలో కొత్తగా అమలు చేసిన నిర్ణయాలు ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి పనులకు బిల్లుల చెల్లింపు లేక పనులు చేసేందుకు గుత్తేదారులు మందుకు రాలేని పరిస్థితి ఉందన్నారు. పెరుగుతున్న పన్నుల భారాలు ఇతర సమస్యలతో నగర వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే లక్షల రుపాయలు ఖర్చు చేసి యాత్రలకు వెళ్లడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. నగర వాసులపై పన్నులు భారాలు మోపుతూ కార్పొరేటర్లు మాత్రం యాత్రలకు వెళ్లడం ఎంత వరకు న్యాయమన్నారు. యాత్రల పేరుతో లక్షల రుపాలయల ప్రజాధనాన్ని ఖర్చు చేయడం మానుకోవాలని సూచించారు.
కార్పొరేటర్ల యాత్రలపై మొదటి నుంచి కూడా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. యాత్రల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం తప్ప.. విజయవాడ ప్రజలకు ఒరిగేదేమి ఉండదని.. విజయవాడ నగర ప్రజలపై ఆంత అభిమానం ఉంటే అధికారులను పర్యటనకు పంపితే ఫలితం ఉంటుంది కానీ కార్పొరేటర్లు అందరూ వెళ్లితే ఏం ప్రయోజనం ఉంటుందనే నగర వాసులు భావిస్తున్నారు. ప్రజలు కట్టే పన్నులతో విజ్ఞాన యాత్ర పేరుతో విహారయాత్రలు చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.
Budameru Canal: దశాబ్దాలుగా దుర్వాసనతో జీవనం.. ఇంకెప్పుడు బాగుపడతాయి సార్ వాళ్ల జీవితాలు..?