AP CM Politics, YS Jagan Helicopter Tours Controversy: పూర్వ కాలంలో రోమ్ తగలబడుతుంటే ఆనాటి నీరో చక్రవర్తి హాయిగా, ప్రశాంతంగా ఫిడేలు వాయించారని రోమన్ చక్రవర్తి నీరో గురించి చాలా మంది ఈ మాట చెబుతుంటారు. కానీ, భారతదేశంలో అత్యంత అప్పుల రాష్ట్రంగా ఘనకీర్తి తెచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి (Andhra PradeshYS Jagan) కూడా ఈ కోవకు చెందిన వ్యక్తే. కేవలం 20కిలోమీటర్ల ప్రయాణం కోసం 200కిలోమీటర్ల నుంచి హెలికాప్టర్‌ను అద్దెకు తెప్పించాలని అధికారులను సీఎంవో ఆదేశించింది. అసలే అప్పుల రాష్ట్రం. నెలంతా పని చేసినా ఉద్యోగులకు జీతాలు కూడా ఒకటో తేదీ ఇవ్వలేని దుస్థితిలో ఉన్న రాష్ట్రంలో ఇలా ప్రజాధనం వృథా చేయటం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.
ఈనెల 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM Jagan) కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఇందుకు సీఎం తాడేపల్లి ప్యాలెస్ నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయం వెళ్లి, అక్కడి నుంచి ఓర్వకల్లు విమానాశ్రాయానికి చేరుకుంటారు. అయితే, ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి వైఎస్ జగన్ పాల్గొనే సభా వేదిక వరకు చేరుకోవడానికి హెలికాప్టరును రప్పిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. వేదిక ఏర్పాటు చేస్తున్న ప్రాంతం నుంచి 20 కిలోమీటర్ల దూరంలోనే ఓర్వకల్లు విమానాశ్రయం ఉంది. దానిని పక్కనే జాతీయ రహదారి, మధ్యలో మరో 4 కి.మీ. మినహా మిగిలిన 16కిలోమీటర్ల రహదారి అంతా నాలుగు లైన్ల జాతీయ రహదారి మార్గం ఉంది. పైగా ఈ 20కిలోమీటర్ల మార్గంలో ఎక్కడా రోడ్డుపై గుంతలు కూడా లేవు. అంతా సాఫీగానే ప్రయాణించవచ్చు. 4లైన్లు లేని నాలుగు కి.మీ. మేర కూడా ఎలాంటి గుంతలు లేవు. అయినా విమానాశ్రయం నుంచి సభావేదిక వద్దకు వచ్చేందుకు హెలికాప్టర్ వినియోగించాలని నిర్ణయించారు.
CM Jagan: మొత్తం కలిపి 30 కి.మీ లేదు.. హెలికాప్టర్ ఎందుకు సీఎం సారు..!
ఇందుకోసం హైదరాబాద్ లేదా విజయవాడ నుంచి రప్పించాలని జిల్లా యంత్రాగానికి సీఎంవో నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఎటు నుంచి వచ్చినా అది కర్నూలుకు చేరాలంటే సుమారు 200 కి.మీ. ఎగిరి రాక తప్పని పరిస్థితి. రహదారులు సరిగా లేకపోతేనో, సభావేదిక దూరంగా ఉన్నప్పుడో హెలికాప్టర్ వినియోగించుకోవడాన్ని ఎవరూ ఆక్షేపించరు. కానీ కేవలం 20 కి.మీ. దూరం కోసం 200 కి.మీ. నుంచి హెలికాప్టర్ రప్పిస్తుండడం చర్చనీయాంశమైంది.
CM Jagan Guntur Tour: కారైనా.. హెలికాఫ్టరైనా.. జగన్ వస్తే ఆంక్షలు కామనే
ఇక కాన్వాయ్ కూడా లేకుండా బస్సుల్లో తిరిగే ముఖ్యమంత్రులు పక్క రాష్ట్రాల్లో ఉంటే, హెలికాప్టర్ లేనిదే ఇంటి నుంచి బయటికి రాని సీఎం ఏపీకి ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఖరి ఇలా ఉంటే సామాన్యులు మాత్రం రాష్ట్రంలో అధ్వాన రహదార్లపై ప్రయాణాలు చేస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఎంత లేదన్న 20కిలోమీటర్ల దూరానికి రెండు కోట్ల ప్రజాధనం ఖర్చు చేస్తున్న తీరు చూసి 'మింగ మెతుకు లేదు కానీ-మీసాలకు సంపెంగ నూనె' అన్నట్లుంది సీఎం జగన్ తీరు అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.