New political party will be formed in AP: ఆంధ్రప్రదేశ్‌లో అతి త్వరలోనే నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నామని, ఇప్పటికే పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయని.. మాజీ ఐఎఎస్ అధికారి వి.జి.ఆర్ నారగోని తెలిపారు. విజయవాడలోని ఓ హోటల్‌లో బీసీ సంఘాల నాయకులు రామకృష్ణయ్య, అన్నా రామచంద్రయాదవ్, విశ్రాంత ఆచార్యులు ఆకురాతి మురళికృష్ణ ఆధ్వర్యంలో విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీల నేతృత్వంలో ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్లతో ఒక బలమైన రాజకీయ శక్తిని, ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపించాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా వెనకబడిన వర్గాలను ప్రధాన పార్టీలన్నీ ఓటు బ్యాంక్‌గా మాత్రమే చూస్తున్నారు తప్పా.. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా అవకాశాలు ఇవ్వటం లేదన్నారు. అందుకే రాజ్యాంగం కల్పించిన హక్కుల రక్షణ కోసం ఒక నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు.
అనంతరం బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కోసం ఒకే పార్టీ.. ఒకే జెండాను ఏర్పాటు చేస్తామన్నారు. వైసీపీ, టీడీపీలు బీసీలకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. త్వరలోనే విజయవాడలో లక్ష మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి.. నూతన పార్టీ పేరును, జెండాను ప్రకటిస్తామన్నారు. నూతన పార్టీ కార్యాలయం విజయవాడలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే పార్టీకి సంబంధించి దిల్లీలో కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.
ఈ నూతన పార్టీలో ఇతర పార్టీల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు చేరనున్నట్లు తెలిపారు. తమకు జాతీయ స్థాయిలో మద్దత్తు లభిస్తుందని.. బీసీల నాయకత్వంలో ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలను ఐక్యం చేస్తామన్నారు. ప్రజలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కల్పించడమే తమ పార్టీ లక్ష్యంగా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందన్నారు. ప్రస్తుత ప్రధాన రాజకీయ పార్టీలు వ్యక్తిగత దూషణలకే ప్రాధాన్యతనిస్తున్నాయని.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం లేదని దుయ్యబట్టారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు గడిచినా.. నేటికీ అనేక కులాల వారికి రాజకీయాల్లో ప్రాధాన్యత లేదన్నారు. తమ నూతన పార్టీతో ఏపీ రాజకీయాల్లో ఓ గొప్ప మార్పు రాబోతోందన్నారు. పార్టీ ఏర్పాటుకి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైందని వెల్లడించారు. తమ పార్టీలో వెనుకబడిన వర్గాలతో పాటు.. మహిళలకూ కూడా ప్రాధాన్యత ఉంటుందన్నారు. తమ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని త్వరలోనే విజయవాడలో ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బడుగు బలహీన వర్గాలతో సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు.
ఇవీ చదవండి