Doctor Turned As Swimmer: ప్రస్తుత యాంత్రిక కాలంలో.. 50 ఏళ్లు వచ్చేసరికే ఆపసోపాలు పడుతుంటారు కొందరు. 30 ఏళ్లలో అనారోగ్య సమస్యలు వచ్చి అల్లాడిపోతారు మరికొందరు. జీవితం అంతే ఇక అని అనుకుని చతికిలపడతారు ఇంకొందరు. అలాంటి వారికి ఆ బామ్మ ఆదర్శం. ఇదివరకే గుండె శస్త్రచికిత్స అయినా ఏ మాత్రం విశ్రమించలేదు. 82 ఏళ్లలోనూ రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొని.. 3 బంగారు పతకాలు సాధించి ఔరా అనిపిస్తున్నారు. సంకల్పానికి వయస్సు అడ్డంకి కాదని నిరూపిస్తున్నారు.
ఈమె పేరు పోతినేని వసుంధరాదేవి. వృత్తిరీత్యా వైద్యురాలు. ప్రస్తుతం 82 ఏళ్లు. ఈ వయసులోనూ విరామం తీసుకోవట్లేదు. ఓవైపు వైద్యసేవలు కొనసాగిస్తూనే మరోవైపు స్విమ్మర్‌గా పేరు సంపాదించుకున్నారు. వసుంధరకు గుండె శస్త్ర చికిత్స కావడంతో ఆరోగ్యంతో మరింత శ్రద్ధ పెట్టారు. వ్యాయామంతోపాటు స్విమ్మింగ్ చేయడం మొదలుపెట్టారు. ఇలా ఈతపై అమితమైన ఆసక్తి పెరిగింది. విజయవాడ గాంధీనగర్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. 50 మీటర్ల పూల్‌లో పోటీ మొదటి సారే అయినా.. మూడు ఈవెంట్లలో బంగారు పతకాలు సాధించి శభాష్ అనిపించుకున్నారు. స్విమ్మింగ్ శారీరక, మానసిక ఆరోగ్యాన్నిస్తుందని వసుంధరాదేవి చెబుతున్నారు.
పశ్చిమగోదావరి దెందులూరుకు చెందిన వసుంధరాదేవి గుంటూరు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. విజయవాడ అమెరికన్ ఆసుపత్రిలో గైనకాలజిస్ట్‌గా పనిచేశారు. కమల నర్సింగ్ హోమ్ పేరుతో వైద్యశాల పెట్టి.. పేదలకు సేవలందించారు. ఇప్పుడు తన కుమారుడు ప్రారంభించిన రమేష్ కార్డియక్ సెంటర్లో పేషెంట్ కేర్ కన్సల్టెంట్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. రోగులను పలకరిస్తూ వారికి జబ్బు, శస్త్రచికిత్సలపై ఉండే భయాన్ని పోగొట్టి మనోధైర్యాన్ని నింపుతున్నారు. బాధితుల కన్నీటి వ్యథకు సజీవరూపం ఇచ్చేలా కథలుగా మలిచారు. వీటన్నిటినీ 'మధుర కథా కదంబం' పేరుతో పుస్తకాన్ని అచ్చు వేయించారు. వయస్సు కేవలం సంఖ్య మాత్రమేనని.. వ్యాయామంతోపాటు స్విమ్మింగ్ చేస్తే ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండవచ్చని వసుంధరాదేవి నిరూపిస్తున్నారు.
ఇవీ చదవండి: