A dispute between YSRCP leaders : ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేతల మధ్య నెలకొన్న పంచాయితీ మరోసారి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరింది. మంత్రి జోగి రమేష్, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మధ్య కొంతకాలంగా నెలకొన్న వర్గ పోరు తారాస్థాయికి చేరింది. పరస్పరం తీవ్ర ఆరోపణలు, విమర్శలతో ఇరు వర్గాలు రచ్చకెక్కాయి.
ఇరువర్గాల ఫిర్యాదు.. మంత్రి జోగి రమేష్ అనుచరుడు నల్లమోతు మధుబాబుపై ఎమ్మెల్యే వసంత అనుచరులు పలు పోలీసు స్టేషన్లలో కేసులు పెట్టగా.. ప్రతిగా జోగి రమేష్ వర్గీయులూ ఫిర్యాదులు చేశారు. మంత్రి, ఎమ్మెల్యే వర్గాలతో నిన్న రీజినల్ కో ఆర్డినేటర్ మర్రి రాజశేఖర్ చర్చలు విఫలమయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన సీఎం జగన్.. నిన్న జోగి రమేష్‌తో.. ఇవాళ వసంత కృష్ణ ప్రసాద్‌ను పిలిపించుకుని మాట్లాడారు. సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సీఎంతో సమావేశమయ్యారు.
సీఎం జగన్‌తో భేటీ... వైఎస్ జగన్‌తో సమావేశమైన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.. మంత్రి జోగి రమేష్ వర్గీయుల వ్యవహార శైలిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. వారి సంగతి వదిలేసి.. వెంటనే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి సూచించినట్లు సమాచారం. నియోజకవర్గంలో ఎమ్మెల్యే అదేశాలను పాటించేలా చర్యలు తీసుకోవాలని సీఎంవో అధికారులకు సీఎం సూచించినట్లు తెలిసింది. త్వరలోనే గడప గడపకు కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని సీఎంకు ఎమ్మెల్యే వసంత చెప్పినట్లు సమాచారం.
ఇవీ చదవండి :