Ysrcp Leader Attack On His Brother Wife In Rampalli : సోదరుడి భార్యను అసభ్యకరంగా దుర్భాషలాడుతూ విచక్షణారహితంగా ఓ వ్యక్తి దాడి చేసిన అమానుష ఘటన నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం రాంపల్లిలో చోటుచేసుకుంది. రఘునాథరెడ్డి అనే వ్యక్తి సొంత సోదరుడి భార్య పార్వతమ్మపై దుర్భాషలాడుతూ కాలితో తన్నుతూ దాడి చేశాడు. ఆస్తి వివాదాలే దాడికి కారణంగా తెలిసింది. ఉమ్మడి ఆస్తిగా ఉన్న పొలంలో తన వాటాకు దక్కిన పొలాన్ని సాగు చేసేందుకు పార్వతమ్మ ప్రయత్నించగా రఘునాథరెడ్డి దాడి చేశాడు. రఘునాథరెడ్డి తన అనుచరులతో పాటు వచ్చి పార్వతమ్మను విచక్షణారహితంగా తన్నాడు. సమీప పొలాల్లో ఉన్న దగ్గరి బంధువులు పార్వతమ్మను రక్షించి ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భర్త మరణంతో తనకు వాటాగా దక్కిన పొలాన్ని లాక్కునేందుకే తనపై రఘునాథరెడ్డి దాడికి దిగాడని బాధితురాలు పార్వతమ్మ తెలిపారు. దాడికి పాల్పడ్డ రఘునాథరెడ్డి వైఎస్సార్సీపీ నాయకుడు. గతంలో చాగలమర్రి మండల అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు.
"పెద్దలది ఆస్తి పంపకాల విషయంలో రఘునాథరెడ్డి కొట్టాడు. కోర్టుకు వెళ్లాను. ఆయన భాగం చేసుకున్నాడు. నా భాగం చేసుకుందామని వెళ్లాను. వేప చెట్టు కింది కూర్చోని ఉన్నా కొడతాడని అనుకోలేదు. వెంట్రుకలు పట్టుకోని కింద పడేసి చెప్పు కాలుతో పొట్టలో తన్నినాడు."- పార్వతమ్మ, బాధితురాలు
గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు : యువకులను, కాలేజీ విద్యార్థులను టార్గెట్ చేసుకొని గుంటూరు, తెనాలి పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న నలుగురిని తెనాలి రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సేకరించిన రెండు కిలోల 100 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రూరల్ సీఐ కార్యాలయంలో డీఎస్పీ జనార్దన్ రావు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నిందితులను హాజరు పరిచారు. డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ తమకు వచ్చిన పక్కా సమాచారంతో సీఐ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో రూరల్ ఎస్సై వెంకటేశ్వర్లు సిబ్బంది సహకారంతో నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న రెండు కేజీల 100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారన్నారు.
గంజాయి తాగే అలవాటున్న ప్రసాద్, గిరీష్ ప్రభు కుమార్, వినయ్ కుమార్లు చెడు వ్యసనాలకు అలవాటు పడి, అక్రమంగా డబ్బు సంపాదించాలని ఈ గంజా వ్యాపారాన్ని ఎంచుకున్నట్లు చెప్పారు. విశాఖపట్నం జిల్లాలోని కొండ ప్రాంతాలలో నివసించే ట్రైబల్స్ వద్ద గంజాయిని తక్కువ రేటు కనుక్కొని వచ్చి కాలేజీ విద్యార్థులనే టార్గెట్గా చేసుకొని చిన్న చిన్న ప్యాకెట్లు చేసి ఒక్కొక్క ప్యాకెట్ సుమారు 500 రూపాయలకి గుంటూరు పట్నం, తెనాలి పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు చెప్పారు. ఈ కేసులో వినయ్ కుమార్ అనే నిందితుడు పరారీలో ఉన్నాడని అతన్ని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. వీరిని కోర్టు హాజరుపరచినట్లు డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు.
మహిళా ఉద్యోగినిపై అసభ్య పదజాలం..ధర్నా : విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం జోన్ మామిడిపాలెంలో యూజర్ చార్జీలు వసూలు చేసేందుకు వెళ్లిన మహిళా ఉద్యోగినిపై అసభ్య పదజాలంతో శానిటేషన్ వెహికల్ డ్రైవర్ చీడి తినాధరావు దూషించాడు. గత శుక్రవారం సాయంత్రం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూడటంతో భీమిలి జోనల్ కార్యాలయం ఎదుట ఆర్పీలు ధర్నా నిర్వహించారు. డ్రైవర్ త్రినాధరావును కొద్దిరోజుల పాటు విధులకు రాకుండా ఆపాలని కమిషనర్ రాము అధికారులకు సూచించారు. దీంతో ఆర్పీలు వెనక్కి తగ్గారు.
ఇవీ చదవండి