Illegal Registration Of DKT Lands For Greenco Company Compensation: ప్రాజెక్టులు, పరిశ్రమలొస్తే స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. కానీ..నంద్యాల జిల్లాలో గ్రీన్‌కో ప్రాజెక్టు రాక మాత్రం..అక్రమార్కులకు వరమైంది. భూసేకరణలో భారీగా అక్రమాలకు తెరలేపి పరిహారాన్ని ఆరగించేస్తున్నారు. నంద్యాల జిల్లా పాణ్యం మండలం పిన్నాపురం, కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు మండలం గుమ్మితంతాండా పరిధిలో గ్రీన్‌కో సంస్థ సోలార్, పవన, పునరుత్పాదక జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. దీనికి సుమారు 6,000 ఎకరాలకు పైగా కేటాయించారు.
2018లో 2,500 ఎకరాలు, 2020లో 250 ఎకరాలు, ఈ ఏడాది 300 ఎకరాల ప్రభుత్వ భూమి అప్పగించారు. దీంతోపాటు డీకేటీ భూమి 274 ఎకరాలు, పట్టా భూమి 300 ఎకరాల వరకు రైతుల నుంచి సేకరించారు. ఈ డీకేటీ భూములు 274 ఎకరాల్లో ఒక్కో ఎకరాకు 5 లక్షల చొప్పున పరిహారానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా ఇంతవరకు మంజూరు కాలేదు. అయితే ఈలోపు డీకేటీ భూమిలో సాగులో ఉండి, ఆన్‌లైన్‌లో పేరున్న రైతులతో అగ్రిమెంట్ చేసుకుని గ్రీన్‌కో సంస్థ ఎకరాకు 8నుంచి 10 లక్షల వరకు పరిహారం చెల్లిస్తోంది. పట్టా భూములను సంస్థ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకుని ఎకరాకు 12 లక్షల వరకు చెల్లిస్తున్నారు. ఇదే అదనుగా అధికార పార్టీ నేతల అండతో అక్రమార్కులు రంగ ప్రవేశం చేశారు.
డీకేటీ భూములు సాగు చేస్తున్న రైతులకు ఆన్‌లైన్‌లో పేరు ఉంటేనే అగ్రిమెంట్ చేసుకుని గ్రీన్‌కో సంస్థ పరిహారం ఇస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న అక్రమార్కులు పాణ్యం తహసీల్దార్ కార్యాలయం నుంచి పావులు కదిపారు. అక్కడి అధికారుల సహకారంతో పరిహారం పొందడానికి అడుగులు వేశారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఆవుల శేషాద్రి కోర్టుకు ఇవ్వాలనే నెపంతో..ఆర్‌ఎస్‌ఆర్ రికార్డు బయటకు తీసుకొచ్చి సహకరించారు. అప్పట్లో భూములు పొందినవారి పేర్లతో కొన్ని నకిలీ సీల్స్ తయారు చేయించి ఆ రికార్డులోకి ఎక్కించారు.
పూర్వీకుల నుంచి వచ్చిన ప్రభుత్వ భూముల్లో వారసులుగా సాగులో ఉంటున్నట్లు ఆన్‌లైన్ చేయించి ఆ ఆధారాలతో గ్రీన్‌కో సంస్థ ద్వారా పరిహారం పొందేందుకు పావులు కదిపారు. ఇరవై సర్వే నంబర్లలో 25 మందికిపైగా పేర్లు ఎక్కించారు. ఆ పేర్లలో ఎక్కువ శాతం మృతి చెందిన వారే ఉండటం గమనార్హం. 209 సర్వే నంబరులో ఎల్‌కే తాండాకు చెందిన లక్ష్మానాయక్ అనే మృతి చెందిన వ్యక్తి పేరుతో 5.11 ఎకరాలు రికార్డులో మార్పు చేశారు.
సర్వే నంబరు 223లో 18.25 ఎకరాలు చుక్కల భూమి కాగా, మృతి చెందిన గువ్వల వెంకటేష్, లక్ష్మానాయక్ పేర్లతో ఎక్కించారు. మొత్తంగా 140 ఎకరాల భూమి చూపించి, 13-14 కోట్లు పరిహారం కొల్లగొట్టే యత్నం చేశారు. ఆ గ్రామ వీఆర్వో ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆర్‌ఐ సహా పలువురిపై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఆర్‌ఐ కనిపించడంలేదు.
పిన్నాపురంలోని సర్వే నంబరు-73లో 4.30 ఎకరాల భూమి ముగ్గురు రైతుల అనుభవంలో ఉంది. ఆన్‌లైన్ వేరే వ్యక్తి పేరు ఎక్కించుకుని గ్రీన్‌కో సంస్థ నుంచి ఎకరాకు 8 లక్షల చొప్పున 36 లక్షలు తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు కేసు పెడతామని హెచ్చరించడంతో పరిహారం నగదు తిరిగి రైతులకు ముట్టజెప్పి సమస్యను వెలుగులోకి రాకుండా చూశారు.
పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అనుచరుడిగా పేరుపొందిన బేతంచర్లకు చెందిన సత్యం అనే వ్యక్తి తప్పుడు రికార్డులతో 20 కోట్ల పరిహారంలో అవినీతికి పాల్పడ్డారని సీపీఐ నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు కలెక్టర్‌కు ఇటీవల ఫిర్యాదు చేశారు. అలాగే డీకేటీ భూముల్లో సాగులో ఉన్నప్పటికీ సరైన ఆధారాల్లేని అన్‌క్లైమ్డ్ భూములను వైసీపీ గ్రామ నాయకులు తమ సర్వే నంబర్లలో కలిపేసుకుని పరిహారం బొక్కేశారు.
పిన్నాపురానికి చెందిన చెంచు జయంపు హనుమంతుకు సర్వే నంబరు 283-1లో 4.32 ఎకరాలు, 284-1లో 5.20 ఎకరాల భూమి ఉంది. హనుమంతు మరణించిన విషయాన్ని గమనించి.. ఆయన కుమార్తె హనుమక్క అంటూ ఏకంగా కుటుంబ వారసత్వ ధ్రువీకరణ పత్రం పుట్టించారు. దీంతో పాటు నోటరీ, మరణ ధ్రువీకరణ పత్రాలతో పొలాన్ని ఆన్‌లైన్ చేసి మహ్మద్ యూనస్‌కు విక్రయించారు.
యూనస్ చేతుల నుంచి మరో నలుగురికి విక్రయించి రిజిస్ట్రేషన్ చేసి పరిహారానికి అడుగులు వేశారు. బంధువులకు తెలిసి ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అసలు హనుమంతుకు పెళ్లే కాలేదని, పెళ్లికాని వ్యక్తికి కూతురు సృష్టించడంలో నకిలీ ఆధార్, వారసత్వ ధ్రువీకరణ పత్రాలు ఉపయోగించినట్లు తేలింది. ఐతే అధికార పార్టీ నేత ఒకరిని, అధికారులను తప్పించేందుకు హడావుడిగా నాలుగు రోజుల్లో విచారణ పూర్తిచేసి కిందిస్థాయి వారిపై కేసులు పెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇవీ చదవండి: