కర్నూలు షరాఫ్ బజార్ ముందు భాగం జేసీబీతో కూల్చేయటంపై వ్యాపారులు ఆందోళన చేపట్టారు. 70 సంవత్సరాలుగా ఉన్న తమ షాపులను నగర పాలక సంస్థ అధికారులు తొలగించాలనుకోవటంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవనాధారమైన ఆ దుకాణాలు లేకపోతే ఆత్మహత్యే దిక్కంటూ.. ఉరి వేసుకున్నట్లుగా ప్రదర్శన చేసి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌కు విషయం తెలియగా.. ఆయన కమిషనర్‌తో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి కొంత సమయం ఇవ్వాలని కోరారు.
మరోవైపు.. అప్పటి నిబంధనలు, అనుమతులతోనే షరాఫ్ బజార్ ఏర్పాటైందని బాధితులు చెబుతున్నారు. అలాంటిది.. అక్రమ నిర్మాణాలని చెప్పి ఇప్పుడు మున్సిపల్ అధికారులు కూల్చేయటం సరైంది కాదని వాపోతున్నారు. సీపీఎం నాయకులు ఘటనాస్థలానికి చేరుకుని షాపు యజమానులకు మద్దతు తెలిపారు. ఇన్నాళ్లుగా లేనిది... అధికారులు ఇప్పుడే ప్రత్యేకంగా ఆక్రమణలుగా గుర్తించారా..? అని ప్రశ్నించారు. వ్యాపారులపై దౌర్జన్యం చేయటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
ఇదీ చదవండి:
అక్రమార్కులకు వరంగా జుర్రేరు వాగు... ప్రభుత్వ భూముల్లో పాగా...