Clash between Local and Kannada devotees: శ్రీశైలంలో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. టీ దుకాణం వద్ద.. కన్నడ భక్తులు, స్థానికులకు మధ్య జరిగిన గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. టీ దుకాణానికి కన్నడ యువకులు నిప్పు పెట్టడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దాడిలో కన్నడ భక్తుడు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని.. 108 అంబులెన్స్‌లో సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడిని జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్ధరామ పండితారాధ్య స్వామి పరామర్శించారు.
హుటాహుటిన శ్రీశైలం చేరుకున్న డీఎస్పీ..: కోపోద్రిక్తులైన కన్నడ యువకులు పురవీధుల్లో సంచరిస్తూ తాత్కాలిక దుకాణాలుు, వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో వ్యాపారస్తులు, స్థానికులు బిక్కుబిక్కుమంటూ అర్ధరాత్రి కాలం గడిపారు. దాడులు ఉద్ధృత స్థాయికి చేరడంతో ఆత్మకూరు డీఎస్పీ శృతి హుటాహుటిన శ్రీశైలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఉగాది మహోత్సవాలకు 500 మంది పోలీసులు బందోబస్తు విధులకు వచ్చినప్పటికీ దాడులను అరికట్టక పోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..: డీఎస్పీ శృతి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు చేపట్టారు. ఆలయ పురవీధుల్లో ఉన్న దుకాణాలను మూసివేయించారు. రాత్రికి గొడవకు కారణమైన ఇద్దరు దుకాణాదారులతోపాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ కన్నడిగుడు ఏ ప్రాంతం వారో తెలుసుకునేందుకు పోలీసులు విచారణ చేస్తున్నారు. మరో నాలుగు రోజుల పాటు ఉగాది ఉత్సవాలు జరగనుండడంతో శ్రీశైలంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు.
ఇదీ చదవండి: Krishna Board Chairman: శ్రీశైలం ఆనకట్టను సందర్శించిన కృష్ణాబోర్డు ఛైర్మన్ దంపతులు