కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో మూడో విడత ఎన్నికలు ఉదయం 6.30 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. నియోజకవర్గంలోని 6 మండలాల్లో 77 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో 136160 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఆదోని రెవెన్యూ డివిజన్ 14 మండలాల్లో 245 పంచాయతీలు ఉండగా.. 26 ఏకగ్రీవం కావటంతో 219 సర్పంచ్ స్థానాలకు 1955 వార్డు స్థానాలకు ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. కర్నూలు రేంజ్ డీఐజీ పి. వెంకటరామిరెడ్డి ఎన్నికల తీరును పర్యవేక్షిస్తున్నారు.
వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లిలో ఓ అభ్యర్థి ఏజెంట్ గిరినాథ చౌదరిని పోలింగ్ స్టేషన్ నుంచి ఎత్తుకుపోయారు. అదే గ్రామంలో వాలంటీర్లు ఇంటింటికి ప్రచారం చేస్తూ ఓటర్లను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని అభ్యర్థి ఆరోపించారు. నందికొట్కూరు మండలం మల్యాల పోలింగ్ కేంద్రంలో విధుల్లో నిర్లక్ష్యం వహించారని ఓపీఓ సురేష్‌ను కలెక్టర్ వీరపాండియన్ సస్పెండ్ చేశారు.
ప్యాపిలి మండలం చండ్రపల్లిలో తెదేపా నేత నాగేశ్వరరావు యాదవ్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. పాములపాడు మండలం ఎర్రగూడూరులో నగదు పంపిణీ చేస్తున్నారని మరో అభ్యర్థి ఆందోళనకు దిగారు.
పత్తికొండ నియోజకవర్గం మద్దికేర మండలంలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి .10 గంటల సమయానికి 20 శాతం పోలింగ్ నమోదు కాగా.. కొన్ని చోట్ల ఓటర్లు లేక పోలింగ్ కేంద్రాలు వెలవెలబోతున్నాయి.
డోన్ నియోజకవర్గంలో మూడవ విడత పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మొత్తం నియోజకవర్గంలో 91 గ్రామ పంచాయతీలు ఉండగా.. 14 ఏకగ్రీవం అయ్యాయి. 67 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరుగుతున్నాయి.
ప్యాపిలి మండలంలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. తెదేపా రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు యాదవ్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.