ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, కప్పులు, బాటిళ్లు.. ఇలా ఒకటేమిటి... సర్వం ప్లాస్టిక్ మయం. కాల్వల్లో, నదుల్లో, చెత్తకుప్పల్లో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కుప్పలుతెప్పలుగా పేరుకుపోయింది. ఒకసారి వాడి పాడేసే ప్లాస్టిక్ వస్తువులను ఇప్పటికే కర్నూలు నగరపాలక సంస్థ నిషేధించింది. అయినా ఎలాంటి మార్పు లేకపోవడంతో ప్రత్యామ్నాయ చర్యలకు వినూత్న ఆలోచన చేసింది. ప్లాస్టిక్‌ను పూర్తిస్థాయిలో తగ్గించాలన్న ఉద్దేశంతో...గాంధీ జయంతి సందర్భంగా.... ప్లాస్టిక్ హటావో- కర్నూలు బచావో అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. నగరంలో 12 చోట్ల ప్లాస్టిక్ సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇళ్లలోని ప్లాస్టిక్‌ను తెచ్చి ఇచ్చిన వారికి ధ్రువపత్రం ఇస్తామని, ఎక్కువ తెచ్చి ఇచ్చినవారికి... బహుమతులు ఇస్తామని ప్రకటించడంతో విశేష స్పందన లభించింది. ప్రజలు పెద్దఎత్తున ప్లాస్టిక్‌ను అధికారులకు అప్పగించారు.
ప్రజల నుంచి సేకరించిన ప్లాస్టిక్ వస్తువులను.. ఓ సిమెంట్ పరిశ్రమ యాజమాన్యానికి అందజేశారు. దీనిని పరిశ్రమలో వినియోగించనున్నారు. ప్లాస్టిక్‌ను అధిక ఉష్ణోగ్రత వద్ద మరిగించి దాని నుంచి సిమెంట్ తయారీకి కావల్సిన ముడి సరకును తయారు చేస్తారు. ప్రజల నుంచి ప్లాస్టిక్ సేకరణ నిరంతర ప్రక్రియ అని యజమానులు చెబుతున్నారు.
ప్లాస్టిక్ వస్తువులు బదులు పేపరు, జనపనారతో చేసిన వస్తువులను ఉపయోగించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్లాస్టిక్ రహిత కర్నూలుగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ నిర్మూలనకు తీసుకొచ్చిన వినూత్న ప్రయోగంతో కొంత వరకు ప్లాస్టిక్ వాడకం తగ్గి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: పుర కమిషనర్ల పదోన్నతులకు రాజకీయగ్రహణం