MIGRATES IN KURNOOL : తరచూ కరవు కాటుకు బలయ్యే కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంత రైతన్నలు.. ఈ ఏడాది అధిక వర్షాలతో కుదేలయ్యారు. సాగు సమయంలో వానలు పడకపోగా .. పంట చేతికందే వేళ కురిసిన భారీ వర్షాలు అన్నదాతల్ని కోలుకోలేని దెబ్బ తీశాయి. వచ్చిన దిగుబడితో వడ్డీ కూడా కట్టలేని పరిస్థితుల్లో.. బంధాల్ని, బంధువుల్ని వదిలి బతుకుదెరువుకు పిల్లా పాపలతో పరాయి రాష్ట్రాలకు పయనమవుతున్నారు.
ఈ ఏడాది కర్నూలు జిల్లాలో 2 లక్షల 59 వేల హెక్టార్లలో పత్తి పంటను సాగు చేశారు. పశ్చిమ ప్రాంతాల్లో నకిలీ విత్తనాల వల్ల మొదట్లోనే రైతన్నలు పెట్టుబడులు నష్టపోయారు. కొన్ని ప్రాంతాల్లో పంట బాగుందనుకున్న సమయంలో భారీ వర్షాలు పడగా... చీడపీడలు దిగుబడిని బాగా దెబ్బతీశాయి. ఎకరాకు రెండు, మూడు క్వింటాళ్ల పత్తి కూడా రాని పరిస్థితి. చేసిన అప్పులు తీర్చటానికి, కుటుంబాన్ని పోషించుకోవటానికి మరో మార్గం లేకపోవడంతో బడికెళ్లుతున్న బిడ్డల్ని చదువుకు దూరం చేసి తమ వెంట తీసుకెళ్లుతున్నారు.
ఓ వైపు అన్నదాతలు నష్టాల సాగుతో ఊరు దాటుతుంటే.. మరోవైపు ఉపాధి అవకాశాలు కరవై.. రైతు కూలీలు వలసలు వెళుతున్నారు. ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆలూరు నియోజవర్గాల్లోని ప్రజలు తెలంగాణ, గుంటూరు ప్రాంతాలకు తరలి వెళ్లడంతో చాలా గ్రామాలు ఖాళీ అయ్యాయి. ఇప్పటికే 30 శాతానికి పైగా పిల్లలు కన్నవారితో కలిసి వలసలు వెళ్లడంతో పాఠశాలల్లో హాజరు శాతం పడిపోయింది. ఇలాంటి వారి కోసం తెలుగుదేశం హయాంలో సీజనల్ హాస్టళ్లు ఏర్పాటు చేయగా.. ప్రస్తుతం అలాంటి ఏర్పాటు లేకపోవడంతో వలసలు పెరుగుతూనే ఉన్నాయి.
గ్రామీణ ఉపాధి హామీ పథకం సైతం ఇక్కడి వారికి అక్కరకు రావడం లేదు. జాబ్ కార్డు ఉన్నవారికి ఏడాదికి కేవలం వంద రోజులు మాత్రమే పని కల్పిస్తున్నారు. అందులోనూ రోజుకు కనీసం 150 రూపాయలు సైతం రాకపోవడంతో ...తప్పని పరిస్థితుల్లో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లుతున్నారు.
ఇవీ చదవండి: