కర్నూలులోని కల్లూరు పట్టణ పరిధి పెద్దపాడులో వడ్లొని వంక ప్రవహిస్తోంది. ఈ వంక ఉల్చాల, రేమట నుంచి పెద్దపాడు మీదుగా ప్రవహించి వక్కెర వాగులో కలుస్తుంది. నగరానికి దగ్గరలో ఉండటంతో ఈ వంకపై అందరి కన్ను పడింది. ఈ వంకను ఆనుకుని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లు వేశారు. ఆ తర్వాత కొద్దికొద్దిగా వంకను ఆక్రమించి రాళ్లు పాతేశారు. సర్వే నంబరు 128లో 1.08 సెంట్లు, 138 సర్వే నంబరులో 3.56 సెంట్ల విస్తీర్ణంలో ఈ వంక స్థలం ఉంది. ఇక్కడ ఎకరా భూమి సుమారు రూ.4 కోట్ల వరకు ధర పలుకుతోంది.
అధికారుల దృష్టికి తీసుకెళ్లినా..:
వంక ఆక్రమణలకు గురైన విషయాన్ని ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు హద్దులు వేసి చేతులు దులుపుకొన్నారు. మళ్లీ ఇప్పుడు ఆక్రమణదారులు రోజురోజుకు వంక స్థలాన్ని పూడ్చేస్తుండటం గమనార్హం. ఆక్రమణదారులు స్థలాన్ని ఆక్రమించడమేకాక యథేచ్ఛగా ప్రహరీని సైతం నిర్మించేస్తున్నారు. ఫలితంగా వంక కనుమరుగవుతుందని, వర్షాకాలంలో నీరు ప్రవహించే మార్గం లేక కాలనీలను ముంచెత్తుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
కాలనీలోకి నీళ్లు
వడ్లొని వంక ఆక్రమణకు గురికావడంతో ఎస్సీ కాలనీ ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. చిన్నపాటి వర్షానికే కాలనీలోకి నీళ్లు వస్తున్నాయి. గతంలో కురిసిన వర్షాలకు వంక ఉద్ధృతంగా ప్రవహించి ఎస్సీ కాలనీలోకి పెద్దఎత్తున నీరు చేరింది. రాత్రి వేళల్లో నీళ్లు ఇళ్లలోకి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నీటి ప్రవాహానికి ప్రభుత్వ పాఠశాల ప్రహరీ సైతం కూలిపోయింది. వసతిగృహంలోకి నీళ్లు వచ్చి విద్యార్థులు నానా కష్టాలు పడ్డారు.
ఇష్టానుసారంగా ఆక్రమించారు
రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొందరు నాయకులు కలసి వడ్లొని వంకను ఆక్రమించారు. ఆ స్థలంలో రాళ్లు పాతి ప్లాట్లు వేశారు. వంక ఆక్రమణలకు గురికావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షానికే వంక పొంగి ఎస్సీ కాలనీలోకి నీరు పెద్దఎత్తున చేరుతోంది. అధికారులు పకడ్బందీ సర్వే నిర్వహించి వంక స్థలం ఎంత ఉందో అక్కడి వరకు కచ్చితమైన హద్దులు వేయాలి. పట్టించుకోకుంటే రానున్న రోజుల్లో పెద్దఎత్తున ఆందోళనలు చేస్తాం. - కె.వెంకటరాముడు, సీపీఎం మండల కార్యదర్శి
పకడ్బందీ చర్యలు తీసుకుంటాం
వడ్లొని వంక ఎలాంటి ఆక్రమణలకు గురికాలేదు. ఈ వంక స్థలాన్ని రస్తాకు ఉపయోగించేవారు. వర్షం పడినప్పుడు నీళ్లు ప్రవహించేవి. నగరపాలక అధికారులతో చర్చించి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేస్తాం. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటాం. - టీవీ రమేష్‌బాబు, కల్లూరు తహసీల్దారు
ఇదీ చదవండి: ముక్కిపోవాల్సిందే.. బియ్యం, కోడిగుడ్లు పాఠశాలల్లోనే నిల్వలు!