కర్నూలు జిల్లాలో తొలి దశ పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే బ్యాలెట్ పత్రాలు ముద్రించి స్థానిక జడ్పీ డీపీఆర్‌సీ భవనంలోని స్ట్రాంగ్ రూంలో పోలీసు బందోబస్తు మధ్య భద్రపరిచారు. ఫిబ్రవరి 9వ తేదీన జరిగే మొదటి దశ పోలింగ్‌కు బ్యాలెట్ పెట్టెలను సిద్ధం చేస్తున్నారు. మండలాలవారీగా సోమవారం పంపేందుకు కర్నూలు డీఎల్‌పీవో కార్యాలయంలో నిల్వ చేస్తున్నారు. కర్నూలు డీఎల్‌పీవో తిమ్మక్క, పర్యవేక్షకుడు శ్రీనివాసరెడ్డి బ్యాలెట్ పెట్టెల పంపిణీ బాధ్యతలు చేపట్టారు.
తొలిదశకు తక్కువ సమయం
తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రచారం చేసుకునేందుకు కేవలం మూడు రోజులే గడువు ఉంటుంది. జనవరి 31వ తేదీ నామినేషన్ పత్రాలు వేసేందుకు తుది గడువు కాగా ఫిబ్రవరి 1వ తేదీ పరిశీలన, 4న అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేస్తారు. 9న పోలింగ్ జరుగుతుంది. అభ్యర్థులు ఒకరోజు ముందుగానే ప్రచారాన్ని ఆపేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో 5, 6, 7 తేదీలు.. మూడు రోజులు మాత్రమే సర్పంచి, వార్డు సభ్యులు ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది.
నీ తొలి దశలో నంద్యాల, శ్రీశైలం, ఆళ్లగడ్డ నియోజకవర్గాల పరిధిలో 186 మైనర్, ఏడు మేజరు పంచాయతీలకు పోలింగ్ జరగనుంది. చాగలమర్రి, శిరివెళ్ల, ఎర్రగుంట్ల, రుద్రవరం, వెలుగోడు, కానాల, యాళ్లూరు మేజరు పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మేజరు పంచాయతీల్లో ప్రధాన రాజకీయ పార్టీలు బలపరిచే అభ్యర్థులు పోటీకి దిగుతున్నారు.
నంద్యాల డివిజన్‌లో:
10 మండలాలు,
169 పంచాయతీలు
కర్నూలు డివిజన్‌లో:
2 మండలాలు, 24 గ్రామ పంచాయతీలు
తొలివిడత పోలింగ్ జరిగే తేదీ: ఫిబ్రవరి 9
ఓటర్లు: 3,89,859
వార్డులు: 1,922
పోలింగ్ జరిగే పంచాయతీలు:
193
పోలింగ్ కేంద్రాలు: 1,980
మండలాలు: 12
నియోజక వర్గాలు: శ్రీశైలం,
ఆళ్లగడ్డ, నంద్యాల
ఇదీ చదవండి: రెబల్స్ బుజ్జగింపులకు నేతల మధ్యవర్తిత్వం