కర్నూలు జిల్లా గూడూరు పట్టణంలోని సింగనగేరికి చెందిన నిరుపేద మహిళలు గత 40 ఏళ్లుగా చింతపండు వ్యాపారం చేస్తున్నారు. కాలనీలో ఈ వ్యాపారం చేసేవాళ్లు దాదాపుగా ఇరవై కుటుంబాలు ఉన్నాయి. ప్రతి ఏటా లాభాల బాటలో నడిచిన చింతపండు వ్యాపారం ఈ ఏడాది ఆశించినంత లాభం రాలేదు. కనీస పెట్టుబడి కూడా రావడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దిగుబడి పెరిగింది.. ఆదాయం తగ్గింది..
గ్రామానికి చెందిన మహిళలు రెండు వేల రూపాయల చొప్పున ఒక్కొక్కరు 20 నుంచి 30 చింతచెట్లను కౌలుకు తీసుకున్నారు. దిగుబడి బాగా ఉన్నప్పటికీ విక్రయానికి ఆశించినంత ధర పలకడం లేదు. ప్రతియేటా క్వింటాల్ చింతపండు రూ. 16 వేల వరకు పలికేది. కానీ ఈ ఏడాది కనీసం ఆరు వేలు కూడా పలకడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వమే ఆదుకోవాలి..
చింతపండును దళారులకు విక్రయించకుండా ప్రభుత్వం ముందుకు వస్తే బాగుంటుందని వ్యాపారులు కోరుతున్నారు. చింతకాయలు, చింతపండు, చింత గింజలు, చింత పొట్టు అన్నీ కలిపి విక్రయించినా కనీస పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రూ.60 వేల పెట్టుబడితో 30 చింత చెట్లు కౌలుకు తీసుకున్నాను. కానీ ఈ ఏడాది ఆశించినంత ఆదాయం రాలేదు. కనీస పెట్టుబడి కూడా దక్కలేదు. -పొన్నగంటి సుంకులమ్మ మహిళా వ్యాపారి.
గత కొన్ని ఏళ్లుగా ఈ వ్యాపారం చేస్తున్నాను. కానీ విక్రయానికి దళారులను నమ్మి మోసపోతున్నాం. చింతపండు కొనుగోలుకు ప్రభుత్వ సహకారం అందించాలి. -రామేశ్వరమ్మ మహిళా వ్యాపారి.
ఇదీ చదవండి: