పర్యావరణ అనుమతుల్లేకుండా తెలంగాణ ప్రభుత్వం డిండి ప్రాజెక్టు చేపట్టినందున పనులు నిలిపివేయాంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్ విచారణకు స్వీకరించింది. కేంద్ర పర్యావరణ శాఖకు, కృష్ణా బోర్డుకు, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఏపీ పిటిషన్‌పై సోమవారం ఎన్జీటీ జ్యుడిషియల్ సభ్యులు జస్టిస్ కె.రామకృష్ణన్, సాంకేతిక సభ్యులు డాక్టర్ కె.సత్యగోపాల్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏపీ అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరాం, న్యాయవాది దొంతిరెడ్డి మాధురిరెడ్డి వాదనలు వినిపిస్తూ సాగునీటి అవసరాల కోసం చేపట్టే ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు అవసరమైనా అవేవీ లేకుండానే తెలంగాణ పనులు చేపడుతోందన్నారు. ఎగువ రాష్ట్రాలు అన్యాయం చేస్తున్నాయంటూ దిగువ రాష్ట్రాలు వాపోతుంటాయని, ఒకసారి అవి ఎగువ రాష్ట్రాలైతే మాత్రం వాటి దృక్పథం మారిపోతుందని, తెలంగాణ తీరు అలాగే ఉందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ఏపీ రైతులకు నష్టం వాటిల్లుతోందన్నారు.
ఆరేళ్ల తర్వాత అభ్యంతరమేమిటి?
తెలంగాణ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ 2015లో ప్రభుత్వం జీవో జారీ చేసిందని, అభ్యంతరాలేమైనా ఉంటే ఆరు నెలల్లో పిటిషన్ వేయాలి కానీ ఏపీ ప్రభుత్వం ఆరేళ్ల తర్వాత వేసిందని, అందువల్ల దానికి కాలపరిమితి ముగిసిందన్నారు. పాలమూరు పథకం తాగునీటి అవసరాలకేనని చెప్పారు. కాలువల నిర్మాణానికి ఎలాంటి టెండర్లు పిలవలేదన్నారు. ఏపీ పిటిషన్ కాలపరిమితిపై అభ్యంతరాలు చెప్పడానికి 3 వారాల గడువు కోరగా.. పనులను చేపట్టబోమంటూ హామీ ఇవ్వాలని ధర్మాసనం పేర్కొంది. లేదంటే యథాతథస్థితిని కొనసాగించాలంటూ మధ్యంతర ఉత్తర్వులిస్తామంది. 8వ తేదీకే అఫిడవిట్ దాఖలు చేస్తామని ఏఏజీ అనడంతో విచారణను ఆరోజుకు వాయిదా వేసింది.
‘హంద్రీ నీవా’ విస్తరణకు అనుమతించొద్దు: తెలంగాణ ఈఎన్‌సీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న హంద్రీ నీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్) విస్తరణ పనులను నిలువరించాలంటూ కృష్ణా బోర్డును తెలంగాణ కోరింది. ఈ మేరకు తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్(ఈఎన్‌సీ) మురళీధర్ బోర్డుకు తాజాగా లేఖ రాశారు. విస్తరణ పనులపై బోర్డుకు గతంలోనూ లేఖలు రాసినట్లు గుర్తు చేశారు. అపెక్స్ కౌన్సిల్, బోర్డు అనుమతులు ఈ ప్రాజెక్టుకు లేవని తెలిపారు. ‘తాజాగా రూ.680 కోట్లతో జిల్లేడుబండ జలాశయం పనులకు ఏపీ పరిపాలన అనుమతులు జారీ చేసింది. టెండర్లకు నోటిఫికేషనూ జారీ చేశారు. అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో 23 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు 2.41 టీఎంసీల సామర్థ్యంతో ఈ జలాశయాన్ని నిర్మిస్తున్నారు’ అని లేఖలో ఈఎన్‌సీ పేర్కొన్నారు.
రేపటి నుంచి బ్రిజేష్ ట్రైబ్యునల్ విచారణ
బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా జల వివాద ట్రైబ్యునల్ విచారణ ఈ నెల ఆరు నుంచి ఎనిమిదవ తేదీ వరకు జరగనుంది. తెలంగాణ తరఫున ఇంజినీరింగ్ అంశాలపై సాక్షిగా ఉన్న కేంద్రజలసంఘం మాజీ ఛైర్మన్ ఘనశ్యాం జా ను ఆంధ్రప్రదేశ్ తరఫు న్యాయవాది క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల అవసరాలు, బేసిన్ బయట ఉన్న ప్రాజెక్టులకు చేసిన కేటాయింపులు, వాటి అవసరాలు తదితర అంశాలపై జా తెలంగాణ తరఫున దాఖలు చేసిన అఫిడవిట్‌లోని అంశాలపై మూడు రోజులపాటు క్రాస్ ఎగ్జామినేషన్ జరగనుంది.
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ముగిసిన వాదనలు
గత ఏడాది జారీ చేసిన ఉత్తర్వులకు విరుద్ధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులు చేపట్టిన ఏపీ ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ నారాయణపేటకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్‌తోపాటు తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ)లో సోమవారం వాదనలు ముగిశాయి. కోర్టు ధిక్కరణ పిటిషన్‌లపై ఎన్జీటీ జ్యుడిషియల్ సభ్యుడు జస్టిస్ కె.రామకృష్ణన్, సాంకేతిక సభ్యుడు డాక్టర్ కె.సత్యగోపాల్‌తో కూడిన ధర్మాసనం వాదనలు విని తీర్పు వాయిదా వేసింది.
ఇదీ చదవండి