నంద్యాల పట్టణంలో గతనెల 25న అపహరణకు గురైన అన్నాచెల్లెళ్ల ఉదంతం విషాదాన్ని మిగిల్చింది. సహజీవనంలో ఉన్న తల్లి పిల్లల్ని సరిగ్గా పట్టించుకోవడం లేదన్న కారణంతో ఓ వ్యక్తి వారిని తీసుకెళ్లాడు. అనంతరం చెల్లెలిని బెంగళూరులో అమ్మి, అన్న(13)ను గొంతు నులిమి హత్య చేయడం స్థానికంగా కలకలం రేపింది.
అమ్మాయిని తల్లికి అప్పగించిన పోలీసులు, కోవెలకుంట్ల మండలం రేవనూరు కేసీ కాల్వ వద్ద బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. నంద్యాల పట్టణానికి చెందిన ఓ మహిళ తన భర్తకు మూడేళ్లుగా దూరంగా ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం. ఆమె ఓ వ్యక్తితో సహజీవనం చేస్తున్నారు.
తమ తల్లి తమను సరిగ్గా చూసుకోవటం లేదని.. పిల్లలు ఇబ్బంది పడుతూ, వారి కుటుంబానికి తెలిసిన చాకలి నాగకృష్ణ అలియాస్ కిట్టుకు బాధను చెప్పుకొన్నారు. నాగకృష్ణ, అతని స్నేహితుడైన కుంజు ధనుంజయుడు కలిసి చిన్నారులను బెంగళూరుకు తీసుకెెళ్లి అక్కడ తమకు తెలిసిన వాళ్లకు వారిని అనాథలుగా చూపి, విక్రయించే ప్రయత్నం చేశారు. వారు అమ్మాయిని మాత్రమే పెంచుకుంటామని చెప్పడంతో చిన్నారిని వారికి అప్పగించారు.
పిల్లల బంధువులకు ఆరోగ్యం బాగాలేదని వారికి చెప్పి రూ.28 వేలు తీసుకున్నారు. అబ్బాయిని తిరిగి నంద్యాలకు తీసుకువచ్చారు. బాలికను బెంగళూరులో అప్పగించిన విషయం ఎక్కడ అతను తన తల్లికి, బంధువులకు చెప్తాడోనన్న భయంతో నాగకృష్ణ, ధనుంజయుడు బాలుణ్ని నంద్యాల మండలం చాబోలు సమీపంలో ఉన్న కేసీ కాల్వ వద్దకు తీసుకెళ్లి గొంతు నులిమి చంపారు. అనంతరం మృతదేహాన్ని కాల్వలో వేశారు.
జనవరి 25న తమ పిల్లలు కనిపించలేదని వారి తల్లి మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మొదట ఆమె భర్తపై అనుమానంతో విచారించారు. అతని వద్ద ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో సీసీ కెమెరాలు పరిశీలించగా నాగకృష్ణ పిల్లలను కిడ్నాప్ చేసిన దృశ్యాలను గుర్తించారు.
నిందితుల్ని విచారించగా ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసినట్లు విచారణ అధికారి సీఐ మోహన్‌రెడ్డి, ఎస్సై నగీనా తెలిపారు. పోలీసులు కేసు విచారణలో ఆలస్యం చేయడం వల్లే బాలుడి ప్రాణాలు పోయాయని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇదీ చదవండి: పంచలింగాల చెక్‌పోస్ట్ వద్ద బంగారం, వజ్రాలు పట్టివేత