రాజశేఖర్... కర్నూలు జిల్లా కోసిగి యువకుడు. కొండలు, చెట్లు, భవనాలు, పెద్దపెద్ద బండరాళ్లను ఏ మాత్రం జంకు, భయం లేకుండా ఎక్కేస్తాడు. చిన్నతనం నుంచి కొండలు, ఎత్తైన వాటిని ఎక్కాలనే కోరిక ఉన్నా, ధైర్యం చాలక ఆ పనిచేసే వాడు కాదు. డిగ్రీ పరీక్షల కోసం ఊరి సమీపంలో ఉన్న కొండప్రాంతాలకు తోటి స్నేహితులతో కలసి వెళ్లేవాడు. అలా ప్రశాంత వాతావరణంలో చీకటి పడేవరకు చదువుకునేవాడు. మధ్య మధ్యలో కొండల్లోనే ఓ గంటసేపు వ్యాయామం చేస్తూ, హైజంప్, లాంగ్ జంప్ లతో సేద తీరేవాడు. ఆ సమయంలోనే కొండలను, బండరాళ్లు, చెట్లను ఎక్కడం అలవాటైందని రాజశేఖర్ చెబుతున్నాడు.
అలా సరదాగా మొదలైన అలవాటు..రాను రాను సాధనతో కొంతకాలానికే కొండలు, చెట్లు, బండరాళ్లు ఎక్కడంలో రాజశేఖర్ ప్రావీణ్యం సంపాదించాడు. అందరూ గంటలో ఎక్కే కొండను రాజశేఖర్ కేవలం 15 నిమిషాల్లో అధిరోహించేవాడు. కొండలు ఎక్కే సమయంలో మధ్యలో తారసపడే వృక్షాలనూ చకచకా ఎక్కేయడం తోటి స్నేహితుల్లో ఆశ్చర్యాన్ని నింపేది. దారికి అడ్డుపడే ముళ్లచెట్లపై నుంచి ఎగిరి దూకడం, భారీ భవనాలను సైతం స్పైడర్‌మ్యాన్‌లా ఎక్కడం ఇప్పుడు రాజశేఖర్ కు సహజంగా వచ్చిన విద్యగా స్నేహితులు అభివర్ణిస్తున్నారు. రాజశేఖర్‌లో ఉన్న ఈ ప్రతిభను గమనించిన స్నేహితులు, బంధువులు అతన్ని ప్రోత్సహించారు.
తల్లిదండ్రులు మాత్రం ఇలాంటి సాహసాలతో ఏదైనా ప్రమాదంలో చిక్కుకుంటాడనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సింహపురి విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు అభ్యసిస్తున్న రాజశేఖర్ ఖాళీ సమయాల్లో కోసిగి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా చదువు చెబుతున్నాడు.
అభిరుచిగా మూడేళ్లుగా కొనసాగిస్తున్న, ఈ సాహసాలలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు రాజశేఖర్. ఎవరెస్టు ఎక్కాలన్నదే తన లక్ష్యమని, ప్రభుత్వం ప్రోత్సహిస్తే, ఆ దిశగా సాగుతానని అంటున్న రాజశేఖర్‌కు ఆల్ ది బెస్ట్ చెబుదామా..!
ఇదీ చదవండి