అర్హులందరికి ఇళ్లు అన్న పథకంలో .. లబ్ధిదారులకు నిరాశే మిగులుతోంది. జాబితాలో మొదటిసారి వారి పేర్లు కనిపించినా..రెండోసారి అస్సలూ ఆ ఊసే లేదు. ఏళ్లతరబడి అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్న..వారిని పట్టించుకున్నా నాథుడే కనిపించడం లేదు.
అనుకూలమైన వారి పేర్లు చేర్చుతున్నారు..!
అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలిచ్చే కార్యక్రమం కర్నూలు జిల్లాలో గతేడాది డిసెంబరు 25న ప్రారంభమైంది. జిల్లాలో మొత్తం 1,008 లే-అవుట్లు వేశారు. వీటిలో కోర్టు కేసుల్లో ఉన్న 28 లే-అవుట్ల పరిధిలో 12,244 మంది లబ్ధిదారులకు ఇంకా పంపిణీ చేయాల్సి ఉంది. ఎలాంటి కోర్టు కేసులు లేనివి జిల్లా అంతా 980 లే-అవుట్లు ఉన్నాయి. వీటికి సంబంధించి 1,61,237 పట్టాల పంపిణీ జరుగుతోంది. కరోనాకు ముందు అర్హులైన జాబితా సిద్ధం చేశారు. అయితే కరోనా తర్వాత అధికార పార్టీ నేతలు అధికారులు, సిబ్బందిపై ఒత్తిడి తెచ్చి కొందరి పేర్లు తీయించి, అనుకూలమైన వారి పేర్లు జాబితాలో చేర్చారు. చాలా చోట్ల గ్రామసభలు పెట్టకుండానే వైకాపా నాయకులిచ్చిన జాబితానే తుదిజాబితాగా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ఒకే ఇంటిలో 2-3 పట్టాలు
జిల్లాలో పాణ్యం, ఛాగలమర్రి, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, ఆదోని, పత్తికొండ, కర్నూలు, ఆలూరు పరిధిలో ఉద్యోగాలున్న కుటుంబాలకు, స్థలాలు, పక్కా ఇళ్లు ఉన్న వారికి, ఒకే రేషన్‌కార్డుపై రెండు, ఒకే ఇంటిలో 2-3 పట్టాలు ఇలా నిబంధనలకు విరుద్ధంగా ఇస్తున్నారు. 65, 72 ఏళ్ల వృద్ధులకు సైతం అర్హుల జాబితాలో చోటు కల్పించారు.
ఉద్యోగుల కుటుంబాలకే ఇచ్చారు..!
ఛాగలమర్రి పరిధిలో ఎక్కువగా ఉద్యోగుల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు కేటాయించారు. ఇక్కడ లబ్ధిదారుల జాబితాలో 8 మంది ఉద్యోగులకు చోటు కల్పించారు. సచివాలయం-3లో పనిచేసే ఓ ఆరోగ్యకార్యకర్త, చెట్టివీడులో పనిచేసే మరో ఏఎన్‌ఎంల పేర్లతో, తెలుగుగంగ కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి భార్య పేరుతో ఇళ్ల పట్టాలు వచ్చాయి. పాణ్యంలో ఒకే రేషన్ కార్డుపై భార్య గుల్జార్‌బేగం 562, భర్త జమాల్ బాషా 256 రెండు ప్లాట్లు, మహేశ్వరి అనే మహిళ ఒకే రేషన్ కార్డు మేకలబండ వద్ద 50, 65 రెండు ప్లాట్లు కేటాయించారు.
మమ్మల్ని ఎవరూ పట్టించుకుంటారు..
నందికొట్కూరు పరిధిలోని నాగటూరులో ఇళ్ల పట్టాల కేటాయింపులో భారీగా అనర్హులకు కట్టబెట్టినట్లు సమాచారం. ఓ చనిపోయిన మహిళ పేరుతో ఇళ్ల పట్టా మంజూరైంది. వంద ఎకరాలున్న ఆసామి కుమారుడికి రాజకీయ ఒత్తిడితో పట్టా కేటాయించారు. ఇచ్చిన వారికే ఇళ్ల పట్టాలు ఇస్తున్నారని, 30ఏళ్లుగా అద్దె ఇళ్లల్లో ఉంటున్నా జాబితాలో పేరు రాలేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి. సత్తా చాటుతున్న ఒంగోలు గిత్తలు.. విజయవాడలో ఉత్సహంగా బల ప్రదర్శన