లాక్‌డౌన్ ప్రభావం పెట్రోలు, డీజిల్ అమ్మకాలపై పడింది. కర్నులు జిల్లాలో 10 శాతం అమ్మకాలు కూడా జరగడం లేదు. జిల్లాలో పెట్రోలు, డీజిల్ బంకులు 552 ఉన్నాయి. కర్నూలు నగరంలో 20, నంద్యాలలో 10, ఆదోనిలో ఆరుతోపాటు వివిధ పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు, మండల కేంద్రాలు, నాలుగు వరుసల, జాతీయ, రాష్ట్ర రహదారులతోపాటు ఇతర ప్రాంతాల్లో అధిక సంఖ్యలో బంకులు నడుస్తున్నాయి. జిల్లాలో రోజూ డీజిల్ విక్రయాలు సుమారు 1.50 లక్షల లీటర్లు ఉండగా, పెట్రోలు అమ్మకాలు 1.10 లక్షల లీటర్ల వరకు ఉంటుంది. ప్రస్తుతం విపణిలో డీజిల్ ధర లీటర్ రూ.68.65 ఉండగా, పెట్రోలు ధర రూ.76.07గా ఉంది. కరోనా విస్తృతి నేపథ్యంలో తొలిసారిగా గత నెల 22న జనతా కర్ఫ్యూ జరిగింది. తర్వాత 24 నుంచి లాక్‌డౌన్ ప్రారంభమైంది. దాంతో ప్రజా రవాణా ఎక్కడికక్కడే నిలిచిపోయింది. ఈ ప్రభావం పెట్రోలు బంకులపై అధికంగా పడింది. అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో గతంతో పోలిస్తే విక్రయాలు 10 శాతం కూడా దాటడం లేదు. నాలుగు వరుసల రహదారి వెంట పెట్రోలు పంపులు 24 గంటలూ పని చేస్తుండగా, జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో 18 గంటలపాటు తెరిచే ఉంటున్నాయి. గత నెల రోజులుగా ఈ బంకులు బోసిపోతున్నాయి. దీంతో కనీసం నిర్వహణ వ్యయం కూడా రాక యజమానులు ఇబ్బందులు పడుతున్నారు.
నిలిచిన రూ.52 కోట్ల లావాదేవీలు
జిల్లాలో గత 32 రోజులుగా కొనసాగుతున్న లాక్‌డౌన్ క్రమంలో ఇంధనం లావాదేవీలు పూర్తిగా తగ్గిపోయాయి. సాధారణంగా జిల్లా వ్యాప్తంగా రోజుకు డీజిల్ విక్రయాలు రూ.1,02,97,500 ఉంటున్నాయి. పెట్రోల్ లావాదేవీలు రూ.83,67,700గా ఉన్నాయి. ఈ లెక్కన 32 రోజుల్లో డీజిల్ విక్రయాల విలువ రూ.32,95,20,000, పెట్రోలు లావాదేవీలు రూ.26,77,66,400 ఉండాలి. కానీ జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడా సగటున 10 శాతానికి మించి ఇంధనం విక్రయాలు కావడం లేదు. ఇక జాతీయ రహదారుల వెంట అయితే కొన్ని బంకుల్లో ఇంధన విక్రయాలు లేక వెలవెలబోతున్నాయి. కొన్నింటిని మూసివేశారు. సాధారణ రోజులతో పోలిస్తే ప్రస్తుతం రూ.52 కోట్లకుపైగా లావాదేవీలు నిలిచిపోయినట్లే లెక్క. ఇక కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్ వంటి మున్సిపాల్టీల్లో అయితే కేవలం పెట్రోల్ విక్రయాలు మాత్రమే నడుస్తున్నాయి. డీజిల్ విక్రయాల్లో పెద్ద వాటా లారీలదే కాగా ప్రస్తుతం ఒక కూరగాయలు, నిత్యావసర సరకులు, పౌర సరఫరాలకు చెందిన లారీలు మాత్రమే పరిమిత స్థాయిలో రవాణా చేస్తున్నాయి. పరిశ్రమలకు చెందిన లారీలతోపాటు మినీ లారీలు, ట్రక్కులు, ఆటోలు, ఇతర త్రిచక్ర వాహనాలు, కార్ల రాకపోకలు పూర్తిగా తగ్గిపోయాయి. అంతోఇంతో అంబులెన్స్‌లు మాత్రం తిరుగుతున్నాయి.
కార్మికులపై ‘ఉపాధి’ వేటు..
జిల్లాలోని పెట్రోలు పంపుల్లో పని చేస్తున్న కార్మికులు ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు షిఫ్టుగా పని చేస్తున్నారు. ఒక షిఫ్టులో పెద్ద పెట్రోలు బంకుల్లో అయితే గరిష్ఠంగా 10 మంది విధులు నిర్వహిస్తుండగా, కనిష్ఠంగా ఇద్దరి వరకు పనుల్లో ఉంటున్నారు. జిల్లాలో కొన్ని బంకుల్లో వాహనాలకు పట్టిన ఇంధనాన్ని బట్టి కమీషన్ ఇస్తుంటే, మరికొన్నింటిలో నెల వేతనం, ఇంకొన్ని బంకుల్లో రోజువారీ వేతనం... ఇలా బంకు పరిస్థితి, వెసులుబాటు ప్రకారం కార్మికుల వేతనాలు ఉంటున్నాయి. ప్రస్తుతం పెద్ద బంకుల్లో లాక్‌డౌన్ నేపథ్యంలో సగం మందికి విశ్రాంతి ఇచ్చారు. ఇక రోజు కూలీ కింద పని చేసేవారిని లాక్‌డౌన్ తర్వాతే పనికి రమ్మనే విధంగా కొన్ని బంకుల యజమానులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా మేనేజర్, క్యాషియర్ వంటి ఉద్యోగాలతో కలుపుకొని 4 వేల మందికిపైగా పెట్రోలు బంకులను నమ్ముకునే విధుల్లో ఉంటున్నారు. వీరిలో సగానికి సగం మందికి లాక్‌డౌన్ క్రమంలో వేతనాల్లో కోత పడింది.
ఇదీ చదవండి... వామ్మో.. ఆ చెట్టంతా కరోనా వైరస్ పువ్వులే!