కర్నూలులోనూ వర్షాలతో రైతులకు నష్టాలు తప్పలేదు. ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ అనేకచోట్ల ఆ పంట తీవ్రంగా దెబ్బతింది. పలు ఇతర పంటలూ నీటమునిగి రైతులకు నష్టాలు మిగిల్చాయి. వర్షాలు లేక 4 ఏళ్లుగా పంటలు లేకపోగా... ఈ ఏడాది భారీ వర్షాలకు ఉన్న పంట దెబ్బతిన్నదని కర్నూలు జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చేతికి వచ్చిన పంట నేల పాలు...
చిన్న మల్కాపురం, పెద్ద మల్కాపురం, కమలాపురం గ్రామాల్లో కురిసిన వర్షానికి కంది, ఉల్లి, ఆముదం, మిరప పంటలు నీట మునిగి.... రైతులు భారీగా నష్టపోయారు. కంది, ఉల్లి పొలాల్లో మోకాల్లోతు నీరు చేరింది. చేతికి వచ్చిన పంట కళ్ల ముందే ధ్వంసమై కర్షకులు విచారంలో మునిగిపోయారు.
రూ.10 లక్షల మేర నష్టం...
చిన్న మల్కాపురం గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అన్నదమ్ములు 12 ఎకరాల్లో ఉల్లి పంట వేశారు. ఇటీవలే పంట కోసి చేలో ఆరబెట్టారు. ఒక్కసారిగా వచ్చిపడిన వర్షానికి పంట మొత్తం కొట్టుకుపోయింది. 10 లక్షల రూపాయల వరకు నష్టం వచ్చిందని రైతులు వాపోయారు. పెద్ద మల్కాపురం గ్రామానికి చెందిన ఓ రైతు 5 ఎకరాల్లో కంది, ఉల్లి పంటలు వేయగా.. పంట పూర్తిగా నీటమునిగి తీవ్ర నష్టం వాటిల్లింది. కమలాపురం గ్రామానికి చెందిన రైతు ఉల్లి, మిరప పంటలు నష్టపోయారు.
వర్షానికి పంటలు నీట మునిగాయని చేతికి వచ్చిన పంట ఇలా కళ్ళ ముందే పాడై పోతుంటే కర్షకులు కంట తడి పెడుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చూడండి- ''నిర్మాణాలకు నోటీసులతో.. లక్షల మందిలో నిరాశ''