Adoni voter list: కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో ఓటర్ల జాబితాను తప్పుల తడకగా రూపొందించి సిబ్బంది చేతులు దులిపేసుకున్నారు. ఒక ఇంట్లో సాధారణంగా నాలుగైదు లేదంటే పది ఓట్లకు మించి ఉండవు. అలాంటిది.. పోలింగ్ స్టేషన్ 222 ఇంటి నెం 17లో 644 ఓట్లు ఉన్నాయి. పోలింగ్ స్టేషన్ 223లో ఒకే ఇంటి నెం 706 ఓట్లు ఉన్నట్లు ఓటరు జాబితాలో ఉంది. ఇలా ఒక ఇంట్లో వందల ఓట్లు ఉండడం చర్చనీయాంశమైంది. కొందరు మృతి చెంది ఏళ్లు గడుస్తున్నా.. వారి పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగించలేదు. ప్రత్యేక ఓటరు నమోదు, సవరణ కార్యక్రమం పలుమార్లు జరిగినా జాబితాను ప్రక్షాళన చేయడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, సాంకేతిక సమస్య వల్ల పోలింగ్ స్టేషన్ లో ఉన్న ఓట్లు.. ఒకే ఇంటి నంబర్‌పై నమోదైనట్లు అధికారులు దాటవేస్తున్నారు.
ఏళ్లు గడిచినా.. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని 222వ పోలింగ్ కేంద్రం పరిధిలో.. 17వ వార్డులో గల న్యూ గాంధీనగర్, అమరావతి నగర్, కల్లుబావి తదితర ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ 17వ నంబర్ ఇంట్లో 644 ఓట్లు, పోలింగ్ స్టేషన్ 223లో 17/836 నంబర్ ఇంట్లో 706 ఓట్లు ఉన్నట్లు జాబితా చూపిస్తోంది. ఇలా కేవలం రెండు ఇళ్లలోనే 1350 ఓట్లు ఎలా ఉన్నాయన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. 2019 వరకు ఓటరు జాబితా సరిగ్గానే ఉన్నా.. ఆ తరువాతే జాబితా రూపం మారిపోయినట్లు తెలుస్తోంది. ఒకే వ్యక్తి పేరున రెండు మూడు ఓట్లు నమోదైనవి సుమారు 10వేల పైనే ఉన్నట్లు గుర్తించిన అధికారు.. ఇటీవల జాబితా నుంచి తొలగించారు. కాగా, దశాబ్దాలుగా స్థానికంగా నివాసం లేని వారి పేర్లకుతోడు.. ఏళ్ల కింద మృతి చెందిన నారి పేర్లు సైతం జాబితా నుంచి తొలగించలేదు. నూతన ఓటర్ల నమోదు, ఓటర్ల సవరణ పలుమార్లు జరిగినా జాబితాను ప్రక్షాళన చేయకపోవడంలో ఆంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఆదోనిలో తప్పుల తడకగా మారిన ఓటర్ల జాబితాను సరిచేయాలని సీపీఎం జిల్లా నాయకుడు రాధాకృష్ణ డిమాండ్ చేశారు. చిరునామా, ఇంటి నంబర్లు, సరిగా లేవని, చనిపోయిన వారి పేర్లతోనూ కొన్ని ఓట్లు ఉన్నాయని ఆయన తెలిపారు. పెళ్లయి వెళ్లిపోయనవారి పేర్లు కూడా జాబితాలో తొలగించలేదని అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపారు.
ఓటరు జాబితాను ప్రక్షాళన చేస్తాం.. ఆదోని నియోజకవర్గంలో ఓటరు జాబితాను పక్కాగా తయారు చేస్తున్నామని తహసీల్దారు వెంకటలక్ష్మి చెప్పారు. ఈ నెల 21 నుంచి ఆగస్టు 21 వరకు ఇంటింటి సర్వే చేసి బీఎల్‌వోల ద్వారా అర్హులైన ఓటర్లను జాబితా రూపొందిస్తామని తహసీల్దార్ వెల్లడించారు. పోలింగ్ స్టేషన్ 222, 223లో ఎక్కువ ఓటర్లు ఉన్న విషయమై పూర్తిస్థాయిలో విచారణ చేయిస్తున్నామని తెలిపారు.