రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులు లేకుండానే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తోందని తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదుపై జాతీయ హరిత ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలతో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆధ్వర్యంలోని ముగ్గురు సభ్యుల బృందం రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించింది.
రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించి ఆగస్టు 16నాటికి నివేదిక ఇవ్వాలన్న జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలకు అనుగుణంగా కృష్ణా బోర్డు కన్వీనర్ డీఎం. రాయపురే, సభ్యులు ఎల్బీ మౌంతంగ్, దర్పన్ తల్వార్..ప్రాజెక్టు ప్రాంతంలో పరిశీలన చేశారు. హైదరాబాద్ నుంచి కర్నూలు వచ్చిన బృందం అక్కడ నుంచి నేరుగా ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం వద్దకు వెళ్లారు. అక్కడే నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి కేఆర్ఎంబీ బృందానికి ప్రాజెక్టు వివరాలను అందించారు.
ముచ్చుమర్రిని ఎందుకు నిర్మించారో వివరాలు తెలుసుకున్న కేఆర్ఎంబీ సభ్యులు..తర్వాత మల్యాల, హంద్రినీవా పథకాల వివరాలు సేకరించారు. ఆ తర్వాత కేఆర్ఎంబీ బృందం రాయలసీమ ఎత్తిపోతల నిర్మిస్తున్న ప్రాంతానికి వెళ్లింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి వివరాలు సేకరించింది. అక్కడి పరిస్థితులను పరిశీలించింది. ఈనెల 16న జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు నివేదిక ఇస్తామని కేఆర్ఎంబీ బృందం స్పష్టం చేసింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు నిలిపివేసినట్టు ఏపీ ప్రభుత్వం చెబుతున్నందున క్షేత్రస్థాయిలో పరిస్థితులపై కేఆర్ఎంబీ బృందం నివేదికపై ఉత్కంఠ నెలకొంది.