కరోనా వేళ గుట్టుచప్పుడు కాకుండా గడివేముల మండలం గని గ్రామంలో రెవెన్యూ అధికారులు మాయాజాలం చేశారు. వాగు పోరంబోకు, అసైన్డ్ భూములను ఇతరుల పేరిట ఆన్‌లైన్‌లో మార్చి భారీగా డబ్బు దండుకున్నారు. గనితోపాటు పలు గ్రామాల్లోని ప్రభుత్వ భూములను వేరేవారికి కట్టబెట్టడంపై ‘ఈనాడు’ వెలుగులోకి తెచ్చింది. క్షేత్రస్థాయిలో పర్యటించి జరిగిన అవకతవకలను ఎండగట్టింది. జిల్లా ఉన్నతాధికారులు దృష్టిపెట్టకపోవడంతో సర్దుబాటు పనిలో రెవెన్యూ అధికారులు నిమగ్నమయ్యారు. వాగు పోరంబోకు 564 సర్వే నెంబరులోని 36.80 ఎకరాల భూమిని తొమ్మిది మంది వ్యక్తులకు పిత్రార్జితం, వారసత్వంగా వచ్చినట్లు అడంగల్ కాపీలో ఏకంగా మండల రెవెన్యూ అధికారి డిజిటల్ సంతకం చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అక్రమాలు బట్టబయలు కావడంతో డిజిటల్ సంతకాన్ని తొలగించి ఆపై రెడ్ మార్కు వేశారు.
గడివేముల మండలంలోని కొర్రపోలూరు, చిందుకూరు, గడిగరేవుల, గడివేముల గ్రామాల్లోని వాగు పోరంబోకు, అసైన్డ్ భూములకు పాసుపుస్తకాలిచ్చిన వాటిని తొలగించే ప్రక్రియ చేపట్టారు. అక్రమంగా కట్టబెట్టిన భూములకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్లో తీసేశారు. మంగళవారం కృష్ణాష్టమి సెలవు దినమైనా అధికారులు ఒకచోటకు చేరి ఆ భూములకు ఎర్ర గుర్తు వేశారు. గని వీఆర్వో, ఇన్‌ఛార్జిగా ఉన్న మంచాలకట్ట వీఆర్వోలతోపాటు కంప్యూటర్ ఆపరేటర్‌కు బుధవారం తహసీల్దార్ తాఖీదులు జారీ చేశారు. భూములకు సంబంధించిన వివరాలు ఎలా మారాయో? వివరణ ఇవ్వాలని తాఖీదులో పేర్కొన్నారు. ఇందులో ప్రమేయం ఉన్న అధికారులు కింది స్థాయి సిబ్బందిని బలి చేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. మండలంలో వందలాది ఎకరాల భూములను ఇతరుల పేరుతో రాసిచ్చిన ఉదంతంలో వీఆర్వోల సంతకాలు లేవు. ఇంత భూ దందా సాగినా స్థానిక రెవెన్యూ ఉన్నతాధికారుల ప్రమేయం లేదా? అన్న ఆరోపణలు వస్తున్నాయి. అక్రమాలపై కింది స్థాయి సిబ్బందిని బాధ్యులను చేసి మండల ఉన్నతాధికారులు తప్పించుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు.
ఆన్‌లైన్ చేసుకోకుంటే హస్తగతమే!
పట్టాభూములను సైతం ఆన్‌లైన్‌లో మార్చి రెవెన్యూ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. గని గ్రామంలో 537-1 సర్వేనెంబరులో 6.08 ఎకరాలు ఉంది. ఆ భూమి నందిపల్లె శంకర్ పేరుమీద ఉంది. అదే సర్వేనెంబరులో గని గ్రామానికి చెందిన దివంగత వెంకటయ్య 1991లో వేరే పొలం కొనుగోలు చేశారు. అతని కుమారుడు చంద్రమౌళి పట్టాదారు పాసుపుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. నందిపల్లె శంకర్ పేరుమీద అదే సర్వే నెంబరులో ఉన్న 6.08 ఎకరాల నుంచి 1.84 ఎకరాలు తొలగించి చంద్రమౌళి పేరు మీద చేర్చారు. నందిపల్లె శంకర్‌కు 4.24 ఎకరాలు ఉంచారు. జూన్ వరకు అంతా బాగానే ఉన్నా, ఆ తర్వాత ఆన్‌లైన్లో 4.24 ఎకరాలు మాత్రమే ఉండడంతో బాధిత రైతు లబోదిబోమంటున్నారు. తనకు ఎటువంటి తాఖీదు ఇవ్వకుండా, తనను సంప్రదించకుండా తన భూమిని ఏవిధంగా తొలగిస్తారని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో చెక్‌డ్యామ్ కట్టిన నీటి కుంటకు సైతం అధికారులు ఆమ్యామ్యాలు తీసుకుని పట్టాలు ఇచ్చేశారు. గడివేములలోని ఇద్దరు కర్షకులకు చెందిన పొలానికి 50-60 సంవత్సరాల నుంచి వారసత్వంగా పట్టా భూమి ఉంది. ఆ భూమికి సంబంధించి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోలేదు. ఆన్‌లైన్లో ఖాళీగా ఉండటంతో పట్టా భూమిని స్థానిక వీఆర్‌ఏలు తమ పేర్లు చేర్చుకున్నారు. తమ భూములకు ఆన్‌లైన్లో వీఆర్‌ఏల పేర్లు ఎక్కడంతో బాధితులు మండల రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. చివరికి పంచాయితీ చేసి రైతుల నుంచి కొంత మొత్తం తీసుకుని పేర్లను ఆన్‌లైన్లో చేర్చుకున్నారు.
అజ్ఞాతంలోకి దళారులు: అక్రమంగా సాగిన భూ పంపిణీలో అధికారులకు పట్టాదారుల మధ్య వ్యవహారం నడిపిన దళారులు అజ్ఞాతంలోకి వెళ్లారు. గనికి చెందిన ఇద్దరు ఈ సంఘటన వెలుగులోకి రాగానే కనిపించకుండా మాయమయ్యారు. ఒక్కో పాసుపుస్తకం కోసం అధికారుల వాటాగా రూ.1.40 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాంతోపాటు దళారులు తమ కమీషనుగా రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు తీసుకున్నారు. దీంతో అక్రమంగా భూములు పొందిన వ్యక్తులు డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా దళారులపై ఒత్తిడి తెస్తున్నారు.
ఇవీ చదవండి